amazon door delivery , amazon prime

డోర్ డెలివరీ కోసం బుజ్జి రోబోను తీసుకొచ్చిన అమెజాన్ కంపెనీ!

తొలుత కేవలం పుస్తకాలు అమ్ముకునే కంపెనీగా ప్రారంభమైన అమెజాన్ ప్రస్తుతం అమ్మని వస్తువు అంటూ లేదు. చౌకగా, నాణ్యత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో అమెజాన్ కు కస్టమర్లు పెరుగుతూనే ఉన్నారు. తాజాగా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అమెజాన్ సిద్ధమయింది. ఇందులో భాగంగా వస్తువులను డోల్ డెలివరీ చేసేందుకు స్కౌట్ అనే రోబోలను ప్రవేశపెట్టింది.

ఈ రోబోను వాషింగ్టన్ లోని స్నోహోమిష్‌ కంట్రీలో బుధవారం ప్రయోగాత్మకంగా పరీక్షించారు. లేత నీలం రంగులో బాక్సు పరిమాణంలో ఉన్న ఈ రోబోకు 6 చక్రాలు అమర్చారు. ఇరుకువీధుల్లో, కాలిబాటలో సులభంగా తిరగగలిగేలా వీటిని రూపొందించారు. ప్రస్తుతం ఈ రోబో వెంట ఓ ఉద్యోగిని పంపుతూ దాని పనితీరును విశ్లేషిస్తున్నామని అమెజాన్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.

తమ చుట్టుపక్కల ఉండే మనుషులు, జంతువులను గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగేలా ఈ యంత్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. ప్రధానంగా కాలేజీలు, స్కూళ్లలో చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్ అందించడానికి ఈ రోబోను వాడే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ రాబోలను త్వరలోనే సియాటెల్ నగరంలో ప్రవేశపెట్టనున్నారు.
Tags: amazon door delivery , amazon prime