పెట్టుబడులకు తలుపులు బార్లా..!

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఆర్థిక సర్వే వచ్చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఈ ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం సభలో ప్రవేశ పెట్టారు. దేశ ఆర్థిక పరిస్థితుల్లో మందగమనం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరి దృష్టీ ఆర్థిక సర్వే మీదే నిలిచింది. పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, ఉత్పాదక రంగాలకు ఊతం ఇవ్వడానికి అవసరమైన ఎలాంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందనే భారీ అంచనాలు .

జీడీపీ వృద్ధి శాతం 6 నుంచి 6.5 శాతం వరకూ

ఈ ఆర్థిక సర్వే ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే- ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం కానున్న 2020-2021 ఆర్థిక సంవత్సరంలో సాధించబోయే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సర్వేలో పొందుపరిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రేటును 6 నుంచి 6.5 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించింది. అనుకున్న లక్ష్యాలను అందుకోవడానికి అవసరమైన చర్యలను చేపట్టబోతున్నట్లు స్పష్టం చేసింది. అవేమిటనేది శనివారం నాటి బడ్జెట్‌లో వెల్లడవుతాయి.

పెట్టుబడుల కోసం విస్తృత అవకాశాలు..

మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలను కల్పించడం ద్వారా జీడీపీ రేటును పెంచాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనితో పాటు- వ్యవసాయ, ఉత్పాదక, సేవ రంగాల పరిధిని విస్తృతం చేస్తామని, ఫలితంగా జీడీపీలో వాటి వాటాను పెంచడానికి అవసరమైన చర్యలను చేపట్టబోతున్నామని తెలియజేసింది. ఆటోమొబైల్ వంటి ఉత్పాదక రంగాల్లో నెలకొన్న మందగమనాన్ని నివారంచడంతో పాటు వాటిని పరుగులెత్తించే దిశగా తమ చర్యలు ఉండబోతున్నాయని ఎకనమిక్ సర్వేలో పేర్కొంది కేంద్రం.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం..

ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం ప్రభావం మనదేశంపై పడిందని, దానివల్లే పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల ఆర్థిక రంగంలో తిరోగమన సంకేతాలు కనిపించాయని, దశాబ్ద కాలం నాటి పరిస్థితులు ఆర్థిక రంగంలో చోటు చేసుకున్నాయని అంచనా వేసింది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ మందగించిందనే విషయాన్ని కేంద్రం అంగీకరించింది. ఆరేళ్ల తరువాత తొలిసారిగా 4.5 శాతానికి క్షీణించిందని పేర్కొంది..

రెడ్ టేపిజం తొలగిస్తాం..

ఉత్పాదక, పారిశ్రామిక రంగాల్లో నెలకొన్న రెడ్ టేపిజాన్ని తొలగించడానికి పూర్తిస్థాయి చర్యలు చేపడతామని కేంద్రం వెల్లడించింది. పెట్టుబడులను ఆహ్వానించడానికి అవసరమైన అడ్డంకులను నివారిస్తామని, భారత్‌ పెట్టుబడులు పెట్టడాన్ని, భారత్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని తమ ఆర్థిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తామని, పబ్లిక్ రంగంలో కొనసాగుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.