Hayat Regency Hotel, Shekhar Ravjiani

హోటల్ బిల్లు చూసి బేర్‌మన్న సంగీత దర్శకుడు శేఖర్

అహ్మదాబాద్‌లోని హయత్ రీజెన్సీ హోటల్‌ మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లకు గాను తన చేతికి ఇచ్చిన బిల్లు ఇదేనంటూ బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావ్‌జియానీ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆ హోటల్‌లో బస చేసిన శేఖర్ నిన్న మూడు ఎగ్‌వైట్‌లతో భోజనం ఆర్డర్ ఇచ్చాడు. భోజనం అనంతరం తన చేతిలో పెట్టిన బిల్లును చూసి శేఖర్ విస్తుపోయాడు. షాక్ నుంచి కోలుకునేందుకు కొన్ని నిమిషాలు పట్టిందట.

ఉడికించిన మూడు కోడిగుడ్లకు రూ.1350, సర్వీసు చార్జ్‌గా రూ.67.50, సీజీఎస్టీ 9 శాతంతో రూ.127.58, ఎస్‌జీఎస్టీ 9 శాతం కింద రూ. 127.58 కలుపుకుని మొత్తం రూ.1672తో ఇచ్చిన బిల్లు చూసి షాకైన రావ్‌జియానీ.. దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఇప్పుడీ బిల్లు వైరల్ అయింది. 15 రూపాయల కోడిగుడ్లకు రూ.1600 ఏంటంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

గతంలో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌‌కు చండీగఢ్‌లో ఇటువంటి అనుభవమే ఒకటి ఎదురైంది. అక్కడి జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో రెండు అరటి పండ్లు కొన్నందుకు ఏకంగా రూ.442.50 బిల్లు వేశారు. అతడు కూడా ఆ బిల్లును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ అధికారులు హోటల్‌కు రూ.25 వేల జరిమానా విధించారు.
Tags: Bollywood, Hayat Regency Hotel, Shekhar Ravjiani