హైదరాబాద్‌లో ‘నిఫా’ కలకలం!

హైదరాబాద్‌లో ‘నిఫా’ సోకినట్లుగా సందేహించిన ఇద్దరు రోగుల్లో ఆ వైరస్‌ లేనట్లు నమూనా పరీక్షల్లో వెల్లడికావడంతో వైద్య ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. కేరళ వెళ్లి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఆ వ్యాధి లక్షణాలు కన్పించడంతో వారి నుంచి రక్తం తదితర నమూనాలను సేకరించి శుక్రవారం ఉదయం పుణెలోని ప్రయోగశాలకు అత్యవసరంగా పంపించారు. వారికి నిఫా వైరస్‌ సోకలేదని పుణెలోని ప్రయోగశాల నుంచి శుక్రవారం రాత్రి ఫలితాలు వెల్లడైనట్లు వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ ఇద్దరు బాధితుల్లో ఒకరు ఫీవర్‌ ఆసుపత్రిలోనూ, మరొకరు నిమ్స్‌లోనూ చికిత్స పొందుతున్నారు. నిమ్స్‌లో చేరిన వ్యక్తికి బ్రెయిన్‌ ఫీవర్‌ సోకడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఫీవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు.

ఈ లక్షణాలు కన్పిస్తే..: నిఫా వైరస్‌ సోకిన వ్యక్తికి జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మత్తుగా ఉండటం, కొందరిలో మూర్ఛ లక్షణాలు కన్పిస్తాయి. 10-12 రోజుల వరకు ఇవి ఉంటాయి. ఆ తర్వాత రోగి నెమ్మదిగా కోమాలోకి వెళ్లిపోతాడు. బ్రెయిన్‌ ఫీవర్‌ వచ్చిందంటే పరిస్థితి విషమంగా మారినట్లేనని వైద్యులు పేర్కొంటున్నారు. రక్తం, కెల్ల, కండరాల్లో వచ్చిన మార్పుల ద్వారా వ్యాధి లక్షణాలు గుర్తిస్తారు. వ్యాధిని అరికట్టడానికి ప్రత్యేకంగా టీకాలు అందుబాటులో లేవు. రోగుల్ని విడిగా ఉంచి కృత్రిమ పద్ధతిలో శ్వాస అందిస్తూ చికిత్స చేస్తారు. ముఖ్యంగా జంతువులు, పక్షులు కొరికి పడేసిన ఫలాలను తినకూడదు. ప్రధానంగా గబ్బిలాలు తిరిగే చోట ఆహార, పానీయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా గుంపుల్లో తిరగక పోవడం, నిఫా రోగుల వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు, చేతులు, ముఖం సబ్బుతో కడుక్కోవడం వంటివి చేయాలి.

ప్రత్యేక వార్డులు ఏర్పాటు: హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమాచారం అందించాలని సూచించింది. కేరళ నుంచి వచ్చే పర్యాటకుల కోసం విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఫీవర్‌, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులో ప్రత్యేక వార్డులు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళ పర్యటనకు వెళ్లొద్దని, అవసరాలను వాయిదా వేసుకోవాలని డాక్టర్‌ శంకర్‌ హెచ్చరించారు. పండ్లు తినే ముందు ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలని, చెట్టు మీదే కొరికిన ఆనవాళ్లున్న పండ్లు అసలు తినవద్దని, కరచాలనం చేయొద్దని సూచించారు.

అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్‌లో నిఫా వైరస్‌ కలకలం నేపథ్యంలో వైద్యఆరోగ్య అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. ప్రజలు అనవసర ప్రచారాలకు భయపడి ఆందోళనకు గురికావద్దన్నారు.