హుజూర్‌నగర్‌లోభారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపు

హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి రికార్డ్ బ్రేక్   
ఇండిపెండెంట్‌ అభ్యర్థి కంటే  బీజేపీ, టీడీపీల అభ్యర్ధులకు ఓట్లు
సూర్యాపేట : హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాగా.. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రచారం పరంగా టీఆర్ఎస్‌కు గట్టిగా పోటీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ పోటీ కౌంటింగ్‌లో అస్సలు కనిపించలేదు. కౌంటింగ్ ప్రారంభం మొదలుకుని చివరి రౌండ్ వరకూ టీఆర్ఎస్ కారు ఓవర్ స్పీడ్‌తోనే దూసుకెళ్లింది. ‘కారు’ జోరుకు కాంగ్రెస్ ‘హస్తం’ నిలబడలేకపోయింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ ‘హస్తం’ హవా అస్సలు కనిపించలేదు. ఇక బీజేపీ, టీడీపీ పార్టీలకు.. ఇండిపెండెంట్‌ అభ్యర్థి కంటే తక్కువగా ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమవ్వగా.. స్వత్రంత్ర అభ్యర్థి మూడో స్థానం దక్కించుకున్నారు.
కాగా.. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ ఉపఎన్నికపై పడుతుందని.. ఫలితాలు తారుమారవుతాయని.. కచ్చితంగా తామే గెలుస్తామని కాంగ్రెస్  ధీమా వ్యక్తం చేసిందీ .  టీఆర్ఎస్ అయితే మొదట్నుంచి కాంగ్రెస్ కంచుకోటను ఈసారి బద్ధలు కొడతామని చెబుతూనే వస్తోంది.
ఇదిలా ఉంటే.. హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి రికార్డ్ బ్రేక్ చేశారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో ఉన్న రికార్డ్‌ను ఈ ఉప ఎన్నికతో బ్రేక్ చేసేశారు. ఈయన సాధించిన మెజార్టీ ఇంతవరకూ హుజూర్‌నగర్‌‌ చరిత్రలోనే సాధించలేదు. ఇప్పటి వరకూ హుజూర్‌నగర్‌లో 29,194 ఓట్లు మెజార్టీ ఉంది. అయితే సైదిరెడ్డి ఏకంగా 43,284 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం./