హరికృష్ణ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు చేయండి: కేసీఆర్

  • తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు
  • చీఫ్ సెక్రటరీని ఆదేశించిన కేసీఆర్
  • హరికృష్ణ కుటుంబసభ్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశం

దివంగత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబసభ్యులతో మాట్లాడి, అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.

మరోవైపు, హరికృష్ణ మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణించారన్న వార్త తెలిసి తట్టుకోలేకపోయానని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన, ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సినీ, రాజకీయాల్లో హరికృష్ణ చేసిన సేవలు మరువలేనివన్న కేసీఆర్, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో హరికృష్ణతో ఎంతో సన్నిహితంగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.