హరికృష్ణ అంతిమయాత్రలో జేబుదొంగల చేతివాటం..

మహాప్రస్థానంలో చెల్లాచెదరుగా ఖాళీ పర్సులు!
తమ చేతివాటానికి సమయం, సందర్భంతో పనిలేదని జేబు దొంగలు నిరూపించారు. నందమూరి హరికృష్ణ అంతిమయాత్రనూ వారు వదిలిపెట్టలేదు. సందట్లో సడేమియాలా అంతిమయాత్రలోకి ప్రవేశించి చేతివాటం చూపారు. యాత్రతోపాటే నడిచివెళ్లిన దొంగలు, దొరికిన వారి జేబులను దొరికినట్టు కొల్లగొట్టారు. వాటిని ఖాళీ చేసి మహాప్రస్థానం ఆవరణలో పడేశారు.

శుక్రవారం ఉదయం మహాప్రస్థానం సిబ్బంది పరిసరాలను శుభ్రం చేస్తుండగా పర్సులు కనిపించాయి. వాటిని సేకరించిన సిబ్బంది మేనేజర్‌కు అప్పగించారు. ఆయన అందులోని వివిధ కార్డుల ఆధారంగా బాధితులకు ఫోన్ చేసి ఎవరి పర్సులను వారికి అందించారు. డబ్బులు పోయినా తమ ఏటీఎం కార్డులు దొరికినందుకు బాధితులు కృతజ్ఞతలు చెప్పారు.