‘స్టార్ మహిళ’కు ఇక సెలవంటున్న సుమ!

స్టార్ మహిళ కార్యక్రమం ముగుస్తుందని చెప్పిన సుమ
12 ఏళ్ళుగా స్టార్ మహిళను ఆదరించిన వారికి కృతజ్ఞతలు
ఫినాలేలో స్టార్ మహిళపై అభిమానుల సెల్ఫీ వీడియోల ప్రసారం
ఆమె తన మాటలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. మలయాళీ అయినా తెలుగును అనర్గళంగా మాట్లాడుతుంది. మంచి ఉచ్చారణ, వినసొంపైన కంఠంతో చక్కని ప్రతిభాపాటవాలతో బుల్లితరపై రాణించిన స్టార్ మహిళ సుమ.. తెలుగు టెలివిజన్ రంగంలో సుమ చేసినన్ని కార్యక్రమాలు మరే యాంకర్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. 12 ఏళ్ళుగా ‘స్టార్ మ‌హిళ’ అనే కార్య‌క్ర‌మాన్ని ఏ మాత్రం బోర్ అనిపించకుడా ఒంటి చేత్తో ముందుకు న‌డిపించిన సుమ ఇక ‘స్టార్ మహిళ’కు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు.

ప్ర‌తి రోజు ఈటీవీలో మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కి ప్ర‌సార‌మ‌య్యే ఈ షోలో మహిళలతో ఆడించి, పాడించి, వారిలో ఉత్సాహాన్ని నింపి స్టార్ మహిళలుగా మనకు వినోదాన్ని అందించిన సుమ మూడు వేల‌కి పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ఆపనున్నట్టు చెప్పి, ‘ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ తనఫేస్ బుక్ బుక్ పేజ్ ద్వారా తెలిపారు. స్టార్ మహిళకు 12 ఏళ్ళుగా 3 వేల ఎపిసోడ్ లకు పైగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమకు ఈ షో ద్వారా ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు కూడా దక్కింది.

తనకు ఇష్టమైన, మహిళాలోకం ఆదరించిన స్టార్ మహిళ కార్యక్రమ ప్రయాణం ముగిసిందని చెప్పి మరో సరికొత్త కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సుమ తెలిపారు. స్టార్ మహిళతో ఉన్న అనుబంధాన్ని సెల్ఫీ వీడియో తీసి పంపాలని కోరిన సుమ, కార్యక్రమాన్ని అభిమానించే అందరికి ధన్యవాదాలు తెలిపింది. ఆయా వీడియోలను గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ప్ర‌సారం చేస్తామని తెలిపారు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్న సుమ ప్రేక్షకుల ప్రేమాభిమానాలను గుండెలో దాచుకుంటానని, అవి మాత్రమే శాశ్వతం అని చెప్పి స్టార్ మహిళ అనిపించుకున్నారు.