సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చంద్రబాబు నాయుడు సస్పెన్షన్ లేఖ!

నాడు ఏం జరిగిందంటూ కొందరు ఆరా
వ్యూహాత్మకంగా విడుదల చేసిన రాజకీయ ప్రత్యర్థులు
ఎమ్మెల్యేలందరినీ తనవైపు తిప్పుకున్న చంద్రబాబు
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు జోరందుకున్నాయి. నేతలందరూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాత, కొత్త విషయాలను, మరుగున పడిన అంశాలను తెరపైకి తెచ్చి విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1995 ఆగస్టు సంక్షోభం తర్వాత అప్పటి మంత్రి చంద్రబాబు నాయుడును టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జారీ చేసిన లేఖ ఇప్పుడు మరోమారు వెలుగులోకి వచ్చి వైరల్ అయింది. లేఖ వైరల్ కావడంతో అప్పుడేం జరిగిందంటూ కొందరు ఆరా తీస్తున్నారు. ఈ లేఖను ఎవరు వైరల్ చేసి ఉంటారనేది బహిరంగ రహస్యమే అయినా, ఈ లేఖ ఎన్టీఆర్ రాసిందేనా? అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆనాడు ఏం జరిగిందంటే..

ఆగస్టు 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఎన్టీఆర్ భార్యగా అప్పటికే స్థానం సంపాదించుకున్న లక్ష్మీపార్వతి పార్టీపై పట్టు సాధిస్తుండడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఎమ్మెల్యేలతో కలిసి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. వైస్రాయ్ హోటల్ వేదికగా అందరినీ తనవైపు తిప్పుకున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ దాదాపు ఎమ్మెల్యేలందరినీ తనవైపు తిప్పుకుని పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. విషయం తెలిసిన ఎన్టీఆర్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని వైస్రాయ్ హోటల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను తిరిగి రావాల్సిందిగా అభ్యర్థించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

చంద్రబాబు తనకున్న బలంతో ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్త పడ్డారు. తర్వాత కాచిగూడలోని బసంత్ టాకీస్‌లో మినీ మహానాడు నిర్వహించి ఎన్టీఆర్‌ను టీడీపీ అధ్యక్షుడిగా తొలగించి తాను అధ్యక్షుడయ్యారు. అనంతరం సెప్టెంబరు 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.