సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడికి కాంగ్రెస్ పగ్గాలు..?

Share This

ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. రాహుల్ మనసు మార్చేందుకు ప్రయత్నాలు అన్నీ విఫలం కావడంతో కొత్త అధ్యక్షుడ్ని నియమించక తప్పదని హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రేపు కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడ్ని నియమించనున్నట్టు తెలుస్తోంది. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందిన ముకుల్ వాస్నిక్ ఏఐసీసీ కొత్త చీఫ్ అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా నివాసంలో సమావేశమయ్యారు. గాంధీల కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని రాహుల్ పట్టుబడుతున్న నేపథ్యంలో, ఏకే ఆంటోనీ పేరు బలంగా వినిపించింది. అయితే ఆయన అధిష్ఠానం ప్రతిపాదనను తిరస్కరించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ సన్నిహితుడు సీకే వేణుగోపాల్ పేరు కూడా చర్చకు వచ్చినా ఆయన కూడా విముఖత వ్యక్తం చేశారు.

చివరికి ప్రియాంక గాంధీని కూడా బరిలోకి లాగే ప్రయత్నం చేసినా ఆమె కూడా నో చెప్పారు. దాంతో, మరాఠా యోధుడు ముకుల్ వాస్నిక్ వైపు పార్టీ పెద్దలు మొగ్గుచూపారు. గతంలో రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన వాస్నిక్ కు పార్టీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. పైగా సోనియాకు అత్యంత విధేయుడిగా పేరుంది. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు వాస్నిక్ కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఏదేమైనా, కాంగ్రెస్ చీఫ్ ఎవరన్న ఉత్కంఠకు రేపటితో తెరపడే అవకాశాలున్నాయి.

Leave a Reply