సీఎం జగన్ కు షాక్.. బీజేపీలోకి మోహన్ బాబు!

బీజేపీలోకి త్వరలో టాలీవుడ్ నటుడు మోహాన్ బాబు కుటుంబం వెళ్లనుందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో మోహాన్ బాబు ఆయన కుమారుడు విష్ణుతో పాటు కుమార్తె మంచు లక్ష్మీ సోమవారం భేటీ అయ్యారు. దాదాపు ప్రధానితో మోహాన్ బాబు కుటుంబం పదిహేను నిమిషాల పాటు సమావేశమయింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మోహాన్ బాబు కుటుంబాన్ని బీజేపీలోకి ప్రధాని మోడీ అహ్వానించినట్టు సమాచారం. దీంతో త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు మోహాన్ బాబు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మోహాన్ బాబు.. ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని వదిలి మోహాన్ బాబు కుటుంబం బీజేపీలోకి ఎందుకు చేరబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయపరంగానే కాకుండా ఏపీ సీఎం జగన్ తో మోహాన్ బాబు కుటుంబానికి బంధుత్వం కూడ ఉంది. మోహాన్ బాబు కుమారుడు విష్ణు భార్య వెరోనికా స్వయనా జగన్ కు చెల్లెలు వరస అవుతుంది. అయినా కూడ మోహాన్ బాబు కాషాయగూటికి వెళ్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.

అయితే మోహాన్ బాబు బీజేపీలోకి వెళ్లడం వెనక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ పదవి మోహాన్ బాబు ఆశించాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే టీటీడీ చైర్మన్ పదవిని మోహాన్ బాబుకు కాకుండా జగన్ తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. దీంతో మోహాన్ బాబు అసంతృప్తితో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలపై మోహాన్ బాబు విమర్శలు గుప్పించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఇసుక కోరత, మూడు రాజధానుల ఏర్పాటుపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేసినా కూడ మోహాన్ బాబు ఇంత వరకు స్పందించలేదు.