సీఎంతో మాట్లాడా.. అంతా సమసిపోయింది: జేసీ

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సోమవారం దాదాపు 20నిమిషాల పాటు భేటీ అయ్యారు. సీఎంతో ఏకాంతంగా చర్చించిన జేసీ వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాజీనామా వంటి ప్రకటనలపైనా చంద్రబాబు జేసీకి కాస్త గట్టిగానే హితబోధ చేసినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం సచివాలయానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధ పెండింగ్‌ దస్త్రాలకు సంబంధించి ఉన్నతాధికారులను కలిశారు.
పార్లమెంట్‌ వదిలి అమరావతిలో తిరుగుతున్నారేంటి అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. అంతా సమసిపోయిందని, తాను పార్లమెంట్‌కు హాజరవుతున్నానని తెలిపారు. మోదీ ప్రధానిగా ఉన్నంతవరకూ విభజన హామీలు అమలుకావని.. అప్పటివరకూ తమ పోరాటం కొనసాగించాల్సిందేనని చెప్పారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం ఒట్టి మాటేనన్న జేసీ.. అధికారంలో ఉండి చేయలేనిది ఇప్పుడేం చేస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయాలు ఎక్కడా బాగాలేదని.. సీఎంతో భేటీ విషయంలో తానేమీ మాట్లాడనంటూ హస్తినకు పయనమ్యారు.