సిద్ధరామయ్యను మరోసారి ముఖ్యమంత్రి కానివ్వను: దేవెగౌడ ఫైర్

కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు. రాజీనామా చేసిన 12 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ఆయన సన్నిహితులేనని చెప్పారు. మరోసారి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని కానివ్వనని వ్యాఖ్యానించారు.

సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయ సంక్షోభం ముగుస్తుందని… ఇదే విషయాన్ని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారని మీడియా ప్రశ్నించగా… ఎట్టి పరిస్థితుల్లో ఆయనను మళ్లీ సీఎంను కానివ్వబోమని సమాధానమిచ్చారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకే సిద్ధరామయ్య తన సన్నిహిత ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డీకే శివకుమార్ నిన్న దేవెగౌడను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవెగౌడ ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags: Devegowda, Siddaramaiah, Kumaraswamy, Karnataka, JDSCongress