సల్మాన్ ఖాన్ నన్ను టార్చర్ పెట్టాడు..అతను చేసిన గాయాలతో శరీరంపై మచ్చలు ఏర్పడకపోవడం నా అదృష్టం!: ఐశ్వర్యారాయ్

మీటూ’ ఉద్యమంపై స్పందించిన నటి
క్యాస్టింగ్ కౌచ్ పై తాను మాట్లాడుతూనే ఉన్నానని వెల్లడి
సల్మాన్ ఖాన్ వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ తనను వేధించాడని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో సోనమ్ కపూర్, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంకచోప్రా సహా పలువురు సెలబ్రిటీలు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. తాజాగా ఈ లైంగిక వేధింపుల వ్యవహారంపై ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ స్పందించింది.

సినీపరిశ్రమలో లైంగిక వేధింపులపై తాను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నానని ఐశ్వర్యారాయ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు తమ బాధను పంచుకోవడానికి సోషల్ మీడియా ఓ సాధనంగా మారిందని వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులను బయటపెట్టడానికి సమయంతో పనిలేదని వెల్లడించింది. కొంచెం ఆలస్యమైనా మీ టూ ఉద్యమం దేశంలో వ్యాపించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని ఐష్ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనను ఏ రకంగా హింసించాడో ఐశ్వర్యారాయ్ చెప్పుకొచ్చింది.

‘2002లో విడిపోయిన తర్వాత కూడా సల్మాన్ ఖాన్ నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదు. అతను నా గురించి చెత్త వాగుడు వాగేవాడు. కలిసి ఉన్నప్పుడు కూడా నన్ను సల్మాన్ శారీరకంగా హింసించేవాడు. నా అదృష్టం ఏంటంటే ఆ గాయాల వల్ల శరీరంపై ఎలాంటి మచ్చలు ఏర్పడలేదు. సల్మాన్ నన్ను గాయపరచినా తెల్లవారి లేచి ఏమీ జరగనట్లే షూటింగ్ కు వెళ్లిపోయేదాన్ని’ అని ఐష్ తన భయానక అనుభవాన్ని గుర్తుచేసుకుంది.