సముద్ర గర్భంలో భయపెడుతున్న వింత జీవి.. వైరల్ వీడియో

మనిషి విశ్వం మొత్తాన్ని అన్వేషిస్తున్నా.. ఇంకా భూమిపైనే ఎన్నో అంతు చిక్కని ప్రదేశాలు, జీవులు సవాలు విసురుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సముద్ర గర్భాన్ని ఇప్పటివరకు మనిషి చాలా వరకు ఛేదించలేకపోయాడు. మహాసముద్రాల లోతుల్లో ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు ఇంకా అలాగే ఉన్నాయి. తాజాగా అలాంటిదే ఓ మిస్టరీ బయటపడింది. ఓ వింత ఆకారంలో ఉన్న భయంకరమైన జీవికి సంబంధించిన తొలి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. దీనికి ముద్దుగా హెడ్‌లెస్ చికెన్ మాన్‌స్టర్ అనే పేరు పెట్టారు. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఈ వింత జీవి కెమెరాకు చిక్కింది.
ఎర్రటి రంగులో, పెద్ద సైజులో ఉన్న ఈ జీవికి తల లేదు. అందుకే దీనికి హెడ్‌లెస్ చికెన్ అనే పేరు పెట్టారు. నిజానికి ఇది సముద్ర గర్భంలో నివసించే కుకుంబర్. దీని శాస్త్రీయ నామం ఎనిప్‌నియాస్టీస్ ఎక్జీమియా. దీనిని తొలిసారి 2017లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో తొలిసారి కనిపెట్టినా.. కెమెరాకు చిక్కడం మాత్రం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా ఫిషరీస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా ఈ జీవిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ వీడియోను కూడా వాళ్లే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.