సమాచారం సేకరించి.. గుట్టుగా అమ్మేసి!

జోరుగా చేతులు మారుతున్న డెబిట్‌, క్రెడిట్‌, ఆధార్‌ వివరాలు
దుర్వినియోగం చేస్తున్న అక్రమార్కులు
* మీరు సకాలంలో క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించినందుకు ధన్యవాదాలు అంటూ ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి ఎల్బీనగర్‌లో ఉంటున్న ప్రసాదరావుకు ఫోన్‌ వచ్చింది. బ్యాంకు ప్రతినిధిగా అతను పరిచయం చేసుకున్నాడు. ప్రసాదరావు పుట్టినతేదీ, ఇంటి చిరునామా, క్రెడిట్‌ కార్డు నంబరు సహా సమాచారం అంతా చెప్పాడు. మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతున్నానంటూ నమ్మబలికాడు. చరవాణికి వచ్చే ఓటీపీ సేకరించాడు.. రూ.50 వేలు కాజేశాడు.
* మీరు నిన్న షాపింగ్‌ చేసినందుకు మూడు బహుమతులు గెలుచుకున్నారంటూ దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మికి బేగంపేటలోని ఒక క్లబ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. మీ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, ఆధార్‌ కార్డు చూపించి ఆ బహుమతులను ఉచితంగా తీసుకోవచ్చని సమాచారం అందింది. బహుమతులు తీసుకున్న పదిహేను రోజుల్లోనే విజయలక్ష్మికి క్రెడిట్‌ కార్డు మంజూరై.. దానిలో రూ.40 వేలు వినియోగించినట్లు సంబంధిత బ్యాంకు నుంచి ఇంటి చిరునామాకు బిల్లు వచ్చింది. వాస్తవానికి ఆమె క్రెడిట్‌ కార్డు తీసుకోనేలేదు.
* మియాపూర్‌లో నివాసం ఉంటున్న రవీంద్రప్రసాద్‌కు ఫోన్‌ చేసి ఒక ప్రైవేటు బ్యాంకు ఉద్యోగిని అని పరిచయం చేసుకున్నాడు. తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. వాట్సాప్‌లో మీ పే స్లిప్‌, పాన్‌, ఆధార్‌ కార్డుల ఫొటోలు పంపించాలని కోరాడు. అన్నీ పంపించిన రెండున్నర నెలల తర్వాత ఇంటికి బ్యాంకు స్టేట్‌మెంటు వచ్చింది. తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీ, అసలు వివరాలతోపాటు కట్టాల్సిన వాయిదా మొత్తం అందులో పేర్కొని ఉంది. రుణం తాను తీసుకోలేదని రవీంద్రప్రసాద్‌… బ్యాంకుకు వెళ్లి బోరుమని విలపించినా ప్రయోజనం లేకపోయింది.
ఆధార్‌.. డెబిట్‌.. క్రెడిట్‌.. ఓటర్‌ కార్డు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌.. తదితర వ్యక్తిగత సమాచారం ప్రస్తుతం అంగట్లో వస్తువులుగా మారిపోయాయి. గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారం నగరంలో పలువురి చేతుల్లో తిరుగుతోంది. దీనిని అక్రమార్కులు అమ్ముకొని రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించే వారి సమాచారం కొన్ని సంస్థలు గుట్టుగా సేకరించి ఇతరులకు అమ్మేస్తున్న సంఘటనలు గ్రేటర్‌లో వెలుగు చూస్తున్నాయి. క్రెడిట్‌స్కోర్‌ ఉచితంగా చూసుకోవచ్చు అంటూ కొన్ని సంస్థలు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి వివిధ ధ్రువపత్రాలు సేకరిస్తున్నాయి.సైబర్‌ నేరగాళ్ల చేతికి వ్యక్తిగత సమాచారం అందడంతో మరిన్ని నకిలీ పత్రాలను సృష్టించి తప్పుగా వినియోగిస్తున్నారు.

రుణాల పేరుతో టోకరా…: నగరంలో పలు ప్రైవేటు బ్యాంకుల్లో పని చేస్తున్నట్లు కొందరు వ్యక్తులు నిత్యం చరవాణులకు ఫోన్లు చేస్తున్నారు. వ్యక్తిగత, వ్యవసాయ, విద్యారుణాలు తక్కువ వడ్డీకి ఇప్పిస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి పలువురు వ్యక్తిగత సమాచారం, గుర్తింపు కార్డులను అందిస్తున్నారు. వాటిని అక్రమదారులు ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తే అన్నీ మీకు సంబంధించిన పత్రాలే ఉన్నాయని, సంబంధం లేదని తప్పించుకోవడానికి వీలులేదంటూ బ్యాంకులు వారిపై కేసులు పెడుతున్నాయి.పోలీసులను ఆశ్రయించి కేసులు నమోదు చేసినా రుణ విముక్తి లభించట్లేదు.

అప్రమత్తత అవసరం: తెలియని వారికి ఎటువంటి వ్యక్తిగత వివరాలూ ఇవ్వకూడదు. అపార్టుమెంట్లలోకి వెళ్లే ముందు సెక్యూరిటీ సిబ్బంది చరవాణి నంబర్లు, వ్యక్తిగత వివరాలు పుస్తకాల్లో నమోదు చేయిస్తున్నారు. వారు ఆ సమాచారాన్ని అక్రమార్కుల చేతికి అందించే ప్రమాదం ఉంటుంది. అత్యవసరమైతే తప్ప గుర్తింపు కార్డులను, వాటి నకలు ప్రతులను ఇతరులకు ఇవ్వకుండా ఉంటే మేలు. ఒకవేళ ఇవ్వాల్సివస్తే దానిని అడ్డంగా క్రాస్‌ చేసి ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

సమాచారం సేకరిస్తున్నారు ఇలా…
* బీమా ప్రీమియం చెల్లించడానికి వెళ్లినప్పుడు మీ చరవాణి సంఖ్య, గుర్తింపు కార్డుల వివరాలు కొన్ని సంస్థలు తీసుకుంటున్నాయి.
* పలు సంస్థల్లోకి ప్రవేశించేటప్పుడు సెక్యూరిటీ సిబ్బంది దగ్గర పుస్తకంలో చరవాణి సంఖ్య, సంతకం తీసుకుంటున్నారు. ఆసిబ్బందికి ఎంతో కొంత నగదు ముట్టజెప్పి ఆ సమాచారాన్ని పలు సంస్థలు కాజేసి సొమ్ము చేసుకుంటున్నాయి.
* షాపింగ్‌మాల్స్‌ ప్రవేశ ద్వారాల దగ్గర పలు సంస్థల ప్రతినిధులుగా పరిచయం చేసుకొని లక్కీడ్రాలో బహుమతులు వస్తాయని సమాచారం తీసుకుంటున్నారు. కొందరైతే కెడ్రిట్‌ కార్డులు, క్లబ్బుల్లో సభ్యత్వాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి వివరాలు సేకరిస్తున్నారు.
* నగరంలోని కొన్ని జిరాక్స్‌ దుకాణాల దగ్గర, ఫొటో స్టూడియోల్లో పనిచేసే పలువురు ఉద్యోగులు..ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను ఆయా సంస్థలకు అందించి, సొమ్ము చేసుకుంటున్నారు.
* ఉద్యోగమేళాల పేరిట నిరుద్యోగుల నుంచి సమాచారం సేకరించి పలుసంస్థలు విక్రయిస్తున్నాయి.
* హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ తదితరాల దగ్గరకు వెళ్లినప్పుడు ఆఫర్లు, కూపన్లు పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు.
* కొన్ని యాప్‌లలో లావాదేవీలు చేసేందుకు ముందుగా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నాయి. వాటిని ఆయా సంస్థలకు అమ్మేసుకుంటున్నాయి.
* వసతిగృహాలు, హోటళ్లలో బస చేసేటప్పుడు ఆధార్‌, వ్యక్తిగత ఫొటోలు కొందరు సేకరిస్తున్నారు. తర్వాత మొత్తం సమాచారాన్ని ఆయా సంస్థలకు అందించి సొమ్ము చేసుకుంటున్నారు.