సంక్షేమ ఫలాలే ఓట్లు గా మార్చుకోవాలని బాబు వ్యూహం!

సీఎం రూట్ మారుతోంది…
ప్రధాని నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శల్లో ఇప్పుడు పదును తగ్గిందా ? మోదీకి గ్రాఫ్ పడిపోయిందనుకున్న చంద్రబాబు ఇప్పుడు డైలమాలో పడ్డారా ? మోదీని వదిలేసి కొత్త వ్యూహాలను ఆయన రచిస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చర్యలు చేస్తుంటే. మొన్నటివరకు నరేంద్ర మోదీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి నరేంద్ర మోదీ అన్యాయం చేశారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ప్రతీదానికి కేంద్రానికి లింక్ పెడుతూ.. మోదీ రాష్ట్రంపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా పడిపోతున్నందున ఆయనను విలన్ గా చూపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో తనకు మేలు జరుగుతుందనేది చంద్రబాబు భావన అయి ఉండొచ్చు. అందుకే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఆయన… వైఫల్యాలను మాత్రం నరేంద్ర మోదీ ఖాతాలో వేసేందుకు ప్రయత్నించారు.దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోతుందని నమ్మిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రారని బలంగా విశ్వసించారు. ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి మోదీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక మూడు నెలలుగా మోదీ వ్యతిరేక ఫ్రంట్ అంటూ వివిధ రాష్ట్రాలు తిరుగుతూ హడావుడి చేశారు. కానీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా నరేంద్ర మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడంతో చంద్రబాబు కూడా ఇప్పుడు డైలమాలో పడ్డట్లు కనిపిస్తోంది. ఈబీసీలకు రిజర్వేషన్ల అంశం నరేంద్ర మోదీకి ఉత్తరాధిన బాగా కలిసివచ్చే అవకాశం ఉంది. పటేళ్లు, జాట్లు, మరాఠా వంటి పలు అగ్రకులాలు మోదీకి మద్దతుగా ఉండే అవకాశాలున్నాయి. దక్షిణాధిన కూడా అగ్రకులాల ప్రజలు నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. దక్షిణాధిన బీజేపీకి ఈ నిర్ణయం పెద్దగా కలిసిరాకున్న ఉత్తరాధిన మాత్రం కచ్చితంగా మేలు చేసేదే. దీంతో మొన్నటివరకు మోదీని గద్దె దింపుతామని నమ్మకంగా ఉన్న కాంగ్రెస్, చంద్రబాబు సహా ఇతర విపక్షాలు ఇప్పుడు కొంచెం నమ్మకం కోల్పోయాయి.నరేంద్ర మోదీపై విమర్శలు చేసి పెద్దగా లాభం ఉండదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అలాగని పూర్తిగా మోదీని విమర్శించడం మానుకోకుండా… తగ్గించాలని అనుకున్నారు. మోదీని విమర్శించడమే ఓట్లు తేవని అనుకుంటున్న ఆయన సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా పింఛన్ల రెట్టింపు వంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలపై మరిన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి మొన్నటివరకు ‘మోదీ వ్యతిరేకత’ అనే అస్త్రాన్నే నమ్ముకున్న చంద్రబాబు ఇప్పుడు ప్లాన్ మార్చి సంక్షేమ పథకాలను విస్తృతం చేయడం, ప్రభుత్వంపై సానుకూలత పెంచడంపై దృష్టి పెట్టారు