శరత్‌ హత్య కేసులో నిందితుడి కాల్చివేత

వాషింగ్టన్‌/హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లాకు చెందిన శరత్‌ కొప్పు ఇటీవల అమెరికాలోని కన్సాస్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానిక రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శరత్‌పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. కాగా.. ఈ ఘటనలో నిందితుడు తాజాగా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.

శరత్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీని పోలీసులు నిన్న గుర్తించారు. నిందితుడిపై నిఘా పెట్టిన ఇద్దరు అండర్‌కవర్‌ అధికారులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. నిందితుడు వారిపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిందితుడు చనిపోయినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

నిందితుడిని హతమార్చడంపై కన్సాస్‌లోని భారత అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. శరత్‌ మృతికి న్యాయం జరిగిందని అసోషియేషన్‌ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం.. శరత్‌ జులై 6న హత్యకు గురయ్యాడు. వరంగల్‌కు చెందిన శరత్‌ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఆరు నెలల కిందటే అమెరికా వెళ్లాడు. మిస్సోరీ యూనివర్శిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్‌కు వచ్చిన నిందితుడు ఆహారం ఆర్డర్‌ చేశాడు. దానికి బిల్లు అడగగా.. చెల్లించలేదు సరికదా డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిందితుడు శరత్‌పై కాల్పులు జరిపాడు.