వైసీపీలో చేరిన కడప కాంగ్రెస్ నేతలు.. కండువా కప్పి స్వయంగా ఆహ్వానించిన జగన్!

వైసీపీలో చేరిన కడప కాంగ్రెస్ నేతలు.. కండువా కప్పి స్వయంగా ఆహ్వానించిన జగన్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల ఏపీ మంత్రి సోమిరెడ్డి బావ రామకోట సుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు క‌నుమూరు ర‌విచంద్రా రెడ్డి, క‌నుమూరు హ‌రిచంద్రా రెడ్డి తమ అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జగన్ వీరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. జిల్లాలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌నీ, రాజ‌న్న రాజ్యాన్ని తెచ్చుకుందామ‌ని తెలిపారు. క‌నుమూరు ర‌విచంద్రా రెడ్డి, క‌నుమూరు హ‌రిచంద్రారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో కుమ్మక్కు అయిందని విమర్శించారు. కాంగ్రెస్-టీడీపీ రహస్య అజెండాతో ముందుకు పోతున్నాయని ఆరోపించారు. పార్టీ తీరు నచ్చకపోవడంతోనే వైసీపీలో చేరామని స్పష్టం చేశారు.

ఏపీలో 60-70 నియోజకవర్గాల్లో దాదాపు 10,000 చొప్పున ఓట్లను చీల్చడానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి టీడీపీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవ‌య్య‌, నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.