వైఎస్ జగన్… కేరాఫ్ కంచరపాలెం!

 

  • నేడు 258వ రోజు పాదయాత్ర
  • నేడు కంచరపాలెంలో బహిరంగ సభ
  • ఏర్పాట్లు పూర్తి చేసిన వైకాపా శ్రేణులు

ప్రజా సంకల్పయాత్ర 258వ రోజులో భాగంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, నేడు విశాఖ శివార్లలోని కంచరపాలెంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆయన పాదయాత్ర, విశాఖ – పశ్చిమ పరిధిలోని గోపాలపట్నం నుంచి ఈ ఉదయం ప్రారంభం కాగా, సాయంత్రం కంచరపాలెం కూడలిలో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటివరకూ 2,916.8 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ పూర్తి చేసుకున్నారని వైకాపా ఓ ప్రకటనలో తెలిపింది.

జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు, తమ సమస్యలను ఏకరవు పెడుతుంటే, త్వరలోనే అన్ని సమస్యలూ తొలగిపోతాయని, తాను అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని జగన్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. నిన్నటి జగన్ పాదయాత్రలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారురుడు రామ్ కుమార్ రెడ్డి, వైకాపా కండువాను కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు దాదాపు 3 వేల మంది నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి భారీ ర్యాలీగా విశాఖ వచ్చి వైకాపాలో చేరారు.