విశ్వవిజేత ఫ్రాన్స్‌ ఫైనల్లో 4-2తో క్రొయేషియాపై ఘనవిజయం

ఓ చిన్న ఆశ అయితే ఉంది కానీ.. ఓ జర్మనీ, ఓ బ్రెజిల్‌, ఓ స్పెయిన్‌ లాంటి జట్లు పోటీలో ఉండగా ప్రపంచకప్‌ సొంతమవుతుందని ఫ్రాన్స్‌ కల అయినా కని ఉండదు. మాజీ విజేత అయినప్పటికీ ఫ్రెంచ్‌ జట్టును ఫేవరెట్‌గా పరిగణించిన వాళ్లు బహు తక్కువ. కానీ ఫ్రాన్స్‌ అద్భుతమే చేసింది. ఎటాకింగ్‌, డిఫెన్స్‌ కలగలిసిన ఆటతో అంచనాలను తలకిందులు చేస్తూ.. అద్వితీయ ప్రదర్శనతో అదిరే విజయాలు సాధిస్తూ విశ్వవిజేతగా నిలిచింది. 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తన చరిత్రలో రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. స్టార్‌ ఆటగాళ్లు మెరిసిన వేళ… రసవత్తరంగా సాగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను మట్టికరిపించింది.
ఎదురుదాడితో గోల్స్‌ మోత మోగించిన ఫ్రాన్స్‌.. బలమైన డిఫెన్స్‌తో గోడ కట్టి ప్రత్యర్థికి కళ్లెం వేసింది. అందరూ హీరోలే. ప్రధాన స్ట్రైకర్‌గా అంచనాలు నిలుపుకుంటూ ఆఖరి సమరంలోనూ గ్రీజ్‌మన్‌ గోల్‌కొడితే.. యువ సంచలనం ఎంబపె ఓ గోల్‌తో మెరిశాడు. మరో స్టార్‌ పోగ్బా కూడా గోల్‌ కొట్టేశాడు. ఫ్రాన్స్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.
పాపం.. క్రొయేషియా. టోర్నీలో సంచలన ప్రదర్శనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. ఎటాకింగ్‌ ఆటతో చక్కని ఆటతీరును ప్రదర్శించినా పెద్ద మ్యాచ్‌లు ఆడడంలోఅనుభవరాహిత్యం, కొన్ని స్వయంకృతాపరాధాలతో క్రొయేషియా దెబ్బతింది. ఓడితేనేం ఆ జట్టు ప్రదర్శన స్ఫూర్తిదాయకం..పోరాటం చిరస్మరణీయం.

ఫ్రాన్స్‌ నిరీక్షణ ఫలించింది. తిరుగులేని ప్రదర్శనతో ఆ జట్టు ప్రపంచకప్‌ 2018 విజేతగా నిలిచింది. గోల్స్‌ మోత మోగించిన ఫ్రాన్స్‌ ఆదివారం జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను మట్టికరిపించింది. చరిత్రలో రెండో సారి కప్పును అందుకుంది. ఫ్రాన్స్‌ ఇంతకుముందు 1998లో ప్రపంచకప్‌ సాధించింది. క్రొయేషియా ఆటగాడు మంజుకిచ్‌ సెల్ఫ్‌ గోల్‌ (18వ)తో ఖాతా తెరిచిన ఫ్రాన్స్‌కు గ్రీజ్‌మన్‌ (38వ, పెనాల్టీ), పోగ్బా (59వ), ఎంబపె (65వ) తలో గోల్‌ అందించారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ), మంజుకిచ్‌ (69వ) చెరో గోల్‌ చేశారు. ఆటగాడి, కోచ్‌గా ప్రపంచచకప్పు గెలిచిన మూడో వ్యక్తిగా ఫ్రాన్స్‌ కోచ్‌ డెషాంప్స్‌ ఘనత సాధించాడు.
ఆట క్రొయేషియాది.. వేట ఫ్రాన్స్‌ది: రెండూ ఎటాకింగ్‌ జట్లే. రెండింటిలోనూ స్టార్‌ ఆటగాళ్లున్నారు. రెండూ అనూహ్యంగానే ఫైనల్‌ చేరాయి. ఐతే విశేష అనుభవమున్న ఫ్రాన్స్‌ ఫేవరెట్టే అయినా.. సంచలనాల క్రొయేషియా కూడా గట్టిపోటీదారే అన్నది మ్యాచ్‌కు ముందు అంచనా. అందుకు తగ్గట్లే మ్యాచ్‌ ఆసక్తికరంగా మొదలైంది. నాటకీయ పరిణామాల మధ్య తొలి అర్ధభాగం రసవత్తరంగా సాగింది. ఆరంభంలో క్రొయేషియాదే పైచేయి. బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకున్న ఆ జట్టు.. దూకుడైన ఆటతో పదే పదే ఫ్రాన్స్‌ బాక్స్‌వైపు దూసుకెళ్లింది. కానీ దురదృష్టం ఆ జట్టును వెంటాడింది. ఎటాకింగ్‌ మొదలెట్టిన వెంటనే ఫ్రాన్స్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.