వాహ్‌ ఏమనాలి..లేహ్‌

ఒంట్లో శక్తి ఉండాలి. గుండెలో ధైర్యం కావాలి. మెదడులో ‘వేగం కన్నా.. ప్రాణం మిన్నా’ అన్న స్పృహ ఉండాలి. అన్నింటినీ మించి దమ్ముండాలి! అలాంటి వారిని ‘మనాలి-లేహ్‌’ రహదారి ఆహ్వానిస్తోంది…! అంతెత్తుండే కొండలు, అంతుతెలియని లోయల గుండా బైకులపై సాగే సాహసయాత్రను అద్భుతమనాల్సిందే!

అందాల కశ్మీరం.. లోయల్లో పూలతో పలకరిస్తుంది. కొండల్లో మంచుతో ముచ్చటగొలుపుతుంది. డొంకల్లో గలగలపారే సెలయేళ్లతో పరవశింపజేస్తుంది.. ఒక్కోచోట ఒక్కో విశేషంతో అలరించే హిమసీమ లద్దాఖ్‌ ప్రాంతంలో మరింత సుందరంగా కనిపిస్తుంది. లద్దాఖ్‌ జమ్ము-కశ్మీర్‌లో భాగమే అయినా.. ప్రత్యేక కారణాల దృష్ట్యా ఈ ప్రాంతానికి ఓ రాజధాని ఉంది. అదే లేహ్‌. విస్తీర్ణం పరంగా దేశంలోనే రెండో అతిపెద్ద జిల్లా. శ్రీనగర్‌ నుంచి లేహ్‌కు 434 కిలోమీటర్లు. బస్సుల్లో వెళ్లొచ్చు. ఈ ప్రయాణం ఆద్యంతం అద్భుతం. కానీ, పర్యాటక ప్రియులు మాత్రం ఈ అవకాశాన్ని తక్కువగానే ఉపయోగించుకుంటారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి నుంచి లేహ్‌కు బయల్దేరుతారు. ఒక్కొక్కరుగా వెళ్తారు. బృందాలుగా కలిసిపోతారు. బైకులపై దుమ్ములేపుతూ దూసుకెళ్తారు.

నాలుగు నెలలు..

మనాలి నుంచి లేహ్‌ 473 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత ఎత్తులో సాగిపోయే ప్రమాదకర రహదారి ఈ రెండు నగరాలను కలుపుతుంది. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు మంచులో కూరుకుపోయి ఉంటుందిది. ఏటా ఏప్రిల్‌ చివరి వారం లేదా మే మొదటివారంలో ఈ దారిలో ప్రయాణాలకు పచ్చజెండా ఊపుతారు. సుమారు నాలుగు నెలల పాటు వచ్చి పోయే పర్యాటకులతో రద్దీగా మారిపోతుంది. ముఖ్యంగా మే-జూన్‌, ఆగస్టు-సెప్టెంబర్‌ మాసాల్లో బైక్‌వీరులు మనాలి నుంచి లేహ్‌ను చూసేందుకు బారులు తీరుతారు. కొండలు ఎక్కుతూ.. లోయల్లో దిగుతూ.. సెలయేళ్లను దాటుతూ.. గుడ్డి మలుపుల్లో జాగ్రత్తగా సాగిపోతారు.

అందుబాటులో అద్దె బైకులు..
మనాలి-లేహ్‌ దారి తెరిచారనే శుభవార్త చెవిన పడగానే.. బైక్‌ క్లబ్‌ల్లో ఉత్సాహం మొదలవుతుంది. దేశం నలుమూలల నుంచి రైడర్‌ క్లబ్‌ సభ్యులు జట్లు జట్లుగా ఇక్కడికి చేరుకుంటారు. సొంత వాహనాలు తెచ్చుకునే వారు కొందరైతే, మనాలీలో భారీ బైక్‌లు అద్దెకు తీసుకునేవారు ఇంకొందరు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, డుకాటి, బీఎమ్‌డబ్ల్యూ బైక్‌లు అద్దెకు దొరుకుతాయి. రోజువారీ అద్దె రూ.1600 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. సీబీజెడ్‌, పల్సర్‌ బైక్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. నచ్చిన బైక్‌ను ఎంచుకొని.. కిక్‌ కొడితే.. ఆగేది ఉండదు. ఏదో యుద్ధానికి వెళ్తున్న సైన్యంలా దూసుకుపోతుంటారు. మలుపులెలా ఉన్నా ఖాతరు చేయరు. చలిగాలి ఊపిరి సలపనీయకున్నా వెనక్కిమళ్లరు. లక్ష్యం లేహ్‌ చేరుకోవడమే. దారిపొడవునా కనిపించే సుందర దృశ్యాలను మదిలో ముద్రించుకోవడమే. లేహ్‌ నగరంలో ఆతిథ్యం ఆస్వాదించి మళ్లీ అవే బైకులపై, అంతే వేగంతో, మరింత ఆనందంతో మానాలికి తిరుగు ప్రయాణం అవుతారు.