వాల్తేరు క్లబ్ భూములజోలికి పోవద్దని గంటా ప్రభుత్వానికి సూచన

విశాఖ నడిబొడ్డున ఉన్న వాల్తేరు క్లబ్, దసపల్లా భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్న కారణంగా ఎలా వాటిని అధిగమించి భూములను స్వాధీనం చేసుకోవాలి అన్న అంశాలను పరిశీలిస్తుంది. అయితే ఇక ఈ భూముల విషయంలో ఏం చెయ్యాలి అన్నదానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సమీక్షిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరుగుతుంటే , విశాఖకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు  విశాఖ నగరంలో దసపల్లా, వాల్తేరు క్లబ్‌ భూముల్ని కొట్టేయడానికి విజయసాయిరెడ్డి అనేక కుట్రలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు . వాటిని కొట్టేసేందుకే విశాఖను రాజధాని చేయాలని ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటోంది అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జగన్‌ ఏకపక్షంగా జీఎన్‌రావుతో నివేదిక ఇప్పించారని టీడీపీ నేతలు మండిపడుతుంటే వైజాగ్‌లో మంచి వాతావరణం ఏర్పడే దిశగా ఆలోచించి, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విశ్వసిస్తున్నానంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల వైఖరి అవలంబించాలి

వాల్తేరు క్లబ్ కు చాలా చరిత్ర ఉందని, ఈ క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల వైఖరి అవలంబిస్తే మంచిదని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు . వైజాగ్ కి ప్రాచీన నామం అయిన వాల్తేరు పేరుతో 1883 లో ప్రారంభం అయినప్పటినుంచి ఈ క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమైందని ఆయన పేర్కొన్నారు . వైజాగ్ బ్రాండ్ లో భాగమైంది అని ఆయన తన ట్వీట్ ద్వారా తెలిపారు.ఇక వాల్తేరు క్లబ్ అందరికీ ఆహ్లాదాన్ని, ఆతిథ్యాన్ని ఇచ్చే అద్భుతమైన ప్రాంతం కావడంతో దీనితో అందరికీ అనుబంధం పెరిగిందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు .

ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన క్లబ్ జోలికి వెళ్ళవద్దని సూచన

ఇక చాలా చరిత్ర ఉన్న వాల్తేరు క్లబ్ లో చాలామంది విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, దేశభక్తులు ఉన్నారని ఆయన చెప్పారు. అంతేకాదు వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన నిపుణులు, దేశ విదేశాలలో తమ తమ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వారు చాలా మంది వాల్తేరు క్లబ్ సభ్యులుగా ఉన్నారని గంటా పేర్కొన్నారు. అలాంటి క్లబ్ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఇక ఈ వ్యవహారంలో సున్నితత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వాల్తేరు క్లబ్ జోలికి పోకుండా ఉండాలని కోరారు. వాల్తేరు క్లబ్ ను యథాతథంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు . ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి, కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాను అని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇక టీడీపీ పార్టీ స్టాండ్ గా రాజధాని అమరావతి మాత్రమే అన్నా, టీడీపీ నేత గంటా మాత్రం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చెయ్యాలనే ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.