వర్షంలో నడుపుతున్నారా.. జాగ్రత్త! వాహన తీరును గమనించాలి

వర్షాలు పడుతున్నాయి. వాహనాలు మొరాయిస్తున్న ఘటనలు సర్వసాధారణం అవుతున్నాయి. ఈ క్రమంలో అనుకోని ప్రమాదాలూ జరిగేందుకు ఆస్కారం ఉంది. తమ వాహనాల పరిస్థితిని యజమానులు ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరముంది. వాహనం నడపడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై ఉన్న మ్యాన్‌హోళ్లను గమనించుకోవాలి. అలానే భారీ ప్రవాహం ఉన్నప్పుడు అటుగా వెళ్లకపోవడమే మంచిది.

సర్వీసింగ్‌ చేయించాలి
వర్షాకాలానికి అనుగుణంగా వాహనాలను సైతం మార్చుకుంటూ ఉండాలి. ఇందుకు ప్రత్యేకంగా వాహనాల సర్వీసింగ్‌ కేంద్రాలు ప్రత్యేక అవగాహన సదస్సులను సైతం నగరంలో నిర్వహిస్తున్నాయి. తడిరోడ్లపై వాహనాలు పనిచేసే తీరుపై ముందుగా అవగాహన తెచ్చుకోవాలి. బ్రేకులు, టైర్లు, వైపర్లు, హెడ్‌లైట్‌ బీమ్‌లు, హారన్‌ సరిగా పనిచేస్తే ఈ కాలంలో వాహన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.

ముంపు ప్రాంతాలకు వెళ్లకండి
నగరంలో పది నిముషాలు వర్షం పడితే చాలు నీరు రోడ్ల మీదకు వచ్చి చేరుతుంది. దీంతో విపరీతమైన ట్రాఫిక్‌ జాం. ఈ సమయమే వాహనదారులకు నరకప్రాయంగా మారుతుంది. ద్విచక్ర వాహనదారులైనా, ఇతర వాహనదారులైనా వర్షం పడుతున్న సమయంలో నడపడం ప్రయాసతో కూడుకున్నదే. నీటిముంపులో కూడా వాహనాలు నడపడంతో బ్రేకులు సరిగా పనిచేయవు.

వేగం నియంత్రించుకోవాలి
వర్షం పడుతున్న సమయంలో వేగంగా వాహనం నడపకూడదు. గతుకుల రోడ్డులో వెళుతున్న సమయంలో అతి వేగం ప్రమాదకరం. అనూహ్యంగా ప్రమాదం ఎదురైతే వాహన వేగాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. కార్లు నడుపుతున్న సమయంలో ఏసీలను వాడటంతో ఇంజిన్‌పై మరింత భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాడకపోవడం మంచిది. వర్షం పడుతున్న సమయంలో వాహనం వేగంగా నడపడంతో ఏర్పడే ప్రమాదాలకు సంబంధించి… ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా మారింది. తడిగా, గతుకులతో ఉన్న రోడ్డుపై వేగంగా వెళుతున్న ఓ ద్విచక్ర వాహనదారు బస్సును ఓవర్‌టేక్‌ చేస్తున్న సమయంలో అదుపుతప్పింది. వెనుక కూర్చున్న ఓ మహిళ బస్సు వెనుక చక్రాలకింద పడిపోయి ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

వాహన భద్రతకు ఇవి చూడండి
* ఉదయాన్నే వాహనాన్ని స్టార్ట్‌చేసే సమయంలో ముందుగా అన్ని భాగాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. చక్రాల్లో గాలి, ఏవైనా లీకేజీలు ఉన్నాయా..? గమనించాలి.
* వైపర్లతో పాటు బ్రేక్‌ ఫ్లూయిడ్‌ స్థాయిని ఒకసారి గమనించాలి.
* వాహనాలకు టెఫ్లాన్‌ కోటింగ్‌ వేయడం మంచిది.
* బండి బురదమయం కాకుండా ఉండటానికి మడ్‌ ఫ్లాప్‌లు ఏర్పాటు చేసుకోవాలి.
* జాయింట్లు కనిపించే ప్రదేశాల్లో తుప్పుపట్టకుండా ఉండటానికి రస్ట్‌ రిపలెంట్‌ స్ప్రేను వాడాలి.

ప్రథమ చికిత్స కిట్‌తో..
ఏ సమయంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా వాహనంలో ప్రథమ చికిత్స కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదం ఎదుటివారికి జరిగిన సమయంలోనూ వారికి వెంటనే చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి కొన్ని అత్యవసరంగా సంప్రదించాల్సిన నెంబర్లను అందుబాటులో ఉంచుకోవాలి. కొద్దిపాటి వర్షం పడినా నగరంలో ట్రాఫిక్‌ సమస్య అంతా..ఇంతా కాదు. గంటలకొద్దీ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా మంచినీరు, స్నాక్స్‌ వాహనంలో ఉంచుకోవడం మంచిది.