వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై శివాజీ కౌంటర్

వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై శివాజీ కౌంటర్

లక్ష్మీపార్వతి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది
ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో చూపించాలి
రాష్ట్రాన్ని కాపాడేందుకే ఆ నిర్ణయం
దాన్ని వెన్నుపోటు అనరు
ఇటీవలి కాలంలో మీడియాకు దూరంగా ఉన్న నటుడు శివాజీ నేడు ఎన్నో విషయాలపై స్పందించారు. దీనిలో భాగంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా లక్ష్మీ పార్వతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని.. దానిలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో చూపించాలన్నారు. కానీ వర్మ.. చంద్రబాబు నాయుడుగారు… రామారావును వెన్నుపోటు పొడిచారంటూ.. ఓ పాటను విడుదల చేశారన్నారు.

నాడు లక్ష్మీపార్వతి నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి చంద్రబాబు నాయుడుతోపాటు కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని శివాజీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో దొరుకుతాయన్నారు. అసలు వైస్రాయ్ హోటల్ దగ్గర చైతన్య రథంపై చెప్పులు విసిరింది కూడా లక్ష్మీపార్వతికి చెందిన మనిషేనని.. దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అన్నారు. కాబట్టి చంద్రబాబు చేసిందాన్ని వెన్నుపోటు అనరని.. వెన్నుదన్ను అంటారన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు కాబట్టే అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని గెలిపించారన్నారు. ప్రజలిచ్చిన ఆ తీర్పే గొప్పదిగా తాను భావిస్తున్నానని శివాజీ పేర్కొన్నారు.