వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్ కలిసే పోటీ చేస్తారు!: వైసీపీ నేత వరప్రసాద్

పవన్‌ను చాలా దగ్గరగా గమనించా
ఆయన విజన్ ఉన్న నాయకుడు
చంద్రబాబు ప్రజాద్రోహి

త్వరలోనే వైసీసీ, జనసేన కలుస్తాయని వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ రెండు పార్టీలు త్వరలోనే కలుస్తాయని, వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ఆయన విజన్ ఉన్న నాయకుడని కితాబిచ్చారు.

గతంలో తాను ప్రజారాజ్యం తరపున తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు పవన్‌ను చాలా దగ్గరుండి గమనించినట్టు చెప్పారు. సమాజానికి ఏదో చేయాలన్న తపన, బాధ్యత ఆయనలో కనిపిస్తాయని పేర్కొన్నారు. వైసీపీలో చాలా విశ్వాసంగా పనిచేస్తున్న తానే ఈసారి తిరుపతి నుంచి బరిలోకి దిగబోతున్నట్టు చెప్పారు. టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా నేతగా జగన్, ప్రజా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని వరప్రసాద్ పేర్కొన్నారు.