లోక్ సభ ఎన్నికలను 15 రోజులు వాయిదా వేయండి.. నిజామాబాద్ లో రైతుల ఆందోళన!

 

 

 

తెలంగాణలోని నిజామాబాద్ లోక్ సభ సీటు నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. పసుపు, ఎర్ర మొక్కజొన్న పంటలకు మద్దతు ధర దక్కకపోవడంపై నిరసనగా రైతన్నలు నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఓ పోలింగ్ అవగాహన కేంద్రం వద్ద రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా

లోక్ సభ ఎన్నికలను 15 రోజుల పాటు వాయిదా వేయాలని రైతులు  డిమాండ్ చేశారు . ఎన్నికల గడువు సమీపించినా ఇంకా తమకు గుర్తులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పోలింగ్ అవగాహన కేంద్రం ముందు బైఠాయించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు రైతన్నలను సముదాయించారు.

ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలవుతుందని రైతులకు రైతన్నలను సముదాయించారు.. ఇలాంటి సందర్భంలో ఆందోళనలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో రైతన్నలు ఆందోళనను విరమించారు.    కాగా నిజామాబాదు ఎంపీ సీటు కోసం  తెరాస నుంచి కవిత, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ , కాంగ్రెస్ నుంచి మదుయాష్కీ బరిలో ఉన్నారు.