లోక్‌సభలో మోదీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

లోక్‌సభలో మోదీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

రాఫెల్ డీల్‌లో మోదీపైనే ఆరోపణలు
రక్షణ మంత్రి లేకుండా ఒప్పందమేంటి?
జేపీసీ వేయాల్సిందే
రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందం విషయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని నిలదీశారు. లోకసభ వేదికగా ఒప్పందంలోని అవకతవకలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ డీల్ విలువ కేవలం రూ. 24 వేల కోట్లేనని కేంద్రం చెబుతోందని, కానీ డీల్ కుదుర్చుకున్న దసాల్ట్ ఏవియేషన్ మాత్రం రూ.60 వేల కోట్లని అంటోందని పేర్కొన్నారు. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మార్చి 2014లో హిందూస్థాన్ ఏరోనాటిక్స్, దసాల్ట్ మధ్య ఒప్పందం జరిగిందని, కానీ దీనిని కాదని 2015లో మోదీ ఉన్నపళంగా రాఫెల్ ఒప్పందాన్ని ప్రకటించారని దుయ్యబట్టారు. రక్షణ మంత్రి లేకుండా దేశ రక్షణకు సంబంధించిన ఒప్పందాన్ని, అది కూడా ఫ్రాన్స్‌లో ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. పాత ఒప్పందాన్ని పక్కనపెట్టి రిలయన్స్‌తో ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని నిలదీశారు. రాఫెల్ ఒప్పందంలో ప్రధానిపైనే నేరుగా ఆరోపణలు వస్తున్నా ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. అలాగే, కాగ్ నివేదికపై రక్షణ మంత్రి ఇప్పటి వరకు పెదవి విప్పలేదని మండిపడ్డారు. వెంటనే జేపీసీ వేసి నిజాలు నిగ్గుతేల్చాల్సిందేనని జయదేవ్ డిమాండ్ చేశారు.