రైల్వే ఛార్జీల కంటే విమాన ఛార్జీలే నయం

దిల్లీ: రైల్వే సంస్థ డబ్బు సంపాదించడంతో పాటు ప్రయాణికుల సౌకర్యాన్ని సైతం దృష్టిలో ఉంచుకొని పథకాలు రూపొందించాలని కాగ్‌ (కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌) నివేదిక సూచించింది. భారత రైల్వే సంస్థ ప్రవేశ పెట్టిన ‘అవసరానుగుణంగా ఛార్జీలు నిర్ణయించే పథకం’ (ఫ్లెక్సీ ఫేర్‌ స్కీమ్‌)పై అధ్యయనం జరిపిన కాగ్‌ ఆ పథకానికి మార్పులు చేయాలని కోరింది. సెప్టెంబర్‌ 2016 నుంచి రాజధాని, దురంతో, శతాబ్ధి రైళ్లలో ఈ పథకాన్ని భారత‌ రైల్వే అమలు చేస్తోంది.

ఈ పథకం ప్రకారం రైళ్లలో 10 శాతం సీట్ల వరకు టిక్కెట్‌ ధర యథావిధిగా ఉంటుంది. 10 నుంచి 20 శాతానికి సీట్లు తగ్గిపోతే ఓ ధర.. 20 నుంచి 30 శాతానికి తగ్గిపోతే మరో ధర.. ఇలా ప్రతి పదిశాతానికి కొంత శాతం ధర పెంచుతూ వెళ్తారు. ఈ పథకం అమలు చేశాక టికెట్ల అమ్మకం, రైళ్లలో ఆక్యుపెన్పీ తగ్గిందని కాగ్‌ పేర్కొంది. అంతకు ముందు రైళ్లలో ఖాళీ బెర్తులు 0.66 శాతం ఉండేవని, ఈ పథకం అమలు తరువాత ఖాళీ బెర్తుల శాతం 4.46 శాతానికి పెరిగిందని తెలిపింది. అంతకు ముందు 2,47,36,469 మంది ప్రయాణికులను ప్రతి రోజూ సంస్థ వారి గమ్య స్థానాలకు చేరవేసేదని ఇప్పుడా సంఖ్య 2,40,79,899కు తగ్గిందని చెప్పింది.

అయితే ఈ పథకం రైల్వే సంస్థకు 2016 సెప్టెంబరు నుంచి 2017 జులై వరకు రూ 553 కోట్ల లాభం ఆర్జించి పెట్టినట్లు కాగ్‌ తెలిపింది. బెర్తులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య మాత్రం 2.65శాతం పడిపోయినట్లు తెలిపింది. లాభంతో పాటు ప్రయాణికుల సంఖ్య సైతం పెరిగేట్లు పథకానికి మెరుగులు దిద్దాలని కాగ్‌ భారతీయ రైల్వేస్‌కు సూచించింది. బస్సులు, విమానాల్లో అధిక ఛార్జీలు భరించలేకే జనం ప్రయాణ సమయం కొంత పెరిగినప్పటికీ రైళ్లపై ఆధారపడతారని, ఇలా చార్జీలు పెంచుకుంటూ పోతే వాళ్లు తిరిగి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తారని చెప్పింది. కొన్ని మార్గాల్లో విమాన ఛార్జీలకంటే రైల్వే ఛార్జీలే అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. 13 రూట్లలో విమాన ప్రయాణానికి ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకుంటే అది రైల్వే ఛార్జీలకంటే తక్కువే అవుతుందని కాగ్‌ చెప్పింది.