రైల్లో దొంగా..దొంగా..!

2018 జూన్‌ : అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని జూటూరు వద్ద కాచిగూడ-చిత్తూరు వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి పది కోచ్‌లపై రాళ్ల దాడి చేశారు. ప్రయాణికుల నుంచి నగలు, నగదు లాక్కున్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లోనూ సిగ్నల్‌ తీగలు కత్తిరించి చోరీకి తెగబడ్డారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
రైళ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు.. వరుస దోపిడీలకు పాల్పడుతూ ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. రైల్వేస్టేషన్‌ సమీప ప్రాంతాలను లక్ష్యంగా మాటేస్తున్నారు. ఆపై సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్న రైళ్లనే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు. నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో బోగీలను లూటీ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఈ తరహా దోపిడీల నివారణ,

2015 నవంబరు: నాందేడ్‌ నుంచి బెంగళూరు వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాళ్లు, కర్రలతో ప్రయాణికులపై దాడికి పాల్పడ్డారు. రాయలసీమ, ఉద్యాన్‌, నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లు దుండగుల బారిన బారిన పడ్డాయి.
2015 మే: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు-టంగుటూరు మధ్య చెన్నై ఎక్స్‌ప్రెస్‌తోపాటు మరో రైలులోనూ దోపిడీకి తెగబడ్డారు. ప్రయాణికుల అరుపులతో రైల్వే పోలీసులు అప్రమత్తం అయ్యారు. గాల్లోకి కాల్పులు జరపడంతో దుండగులు రాళ్లు రువ్వి పారిపోయారు

ఇదీ పరిస్థితి!
రైల్వే అనేది అతి పెద్ద ప్రభుత్వ వ్యవస్థ. ఇందులో ప్రయాణికులు, రైల్వే భద్రత కోసం అనేక కీలక విభాగాలున్నాయి. జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ తదితరాలు ఆ కోవలోకే వస్తాయి. ఇవన్నీ రైల్వేస్టేషన్‌, పట్టాల వెంబడి మాత్రమే పనిచేయడానికి అవకాశం ఉంది. దీన్నే ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌కు చెందిన ముఠాలు బృందాలుగా విడిపోయి రైళ్లపై దాడులకు దిగుతున్నాయి. చాలా సందర్భాల్లో అనుకోని ఘటన జరిగిన తరవాత పోలీసుల ద్వారా కేసులను నిగ్గుతేల్చాల్సిన అవసరం వస్తోంది. తమకున్న పరిమిత వనరుల ద్వారా కేసులపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడే జీఆర్పీ, పోలీసుశాఖ సమష్టిగా ముందుకెళితే దోపిడీల నియంత్రణ, నేరగాళ్లను అదుపు చేయడానికి అవకాశం ఉంది. దీన్నే ఆధారంగా చేసుకుని కడప పోలీసులు అడుగేస్తున్నారు.

ముందు జాగ్రత్త
ప్రస్తుతం కడప పోలీసులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగానే జీఆర్పీ విభాగంతో కలసి ముందుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. తమ పరిధిలోని పెట్రోలింగు, ఐ-స్పార్క్‌ విభాగాలను దీని కోసం వినియోగించనున్నారు. తద్వారా సమయానుకూలంగా పర్యవేక్షణ, రైల్వేస్టేషన్లలో జీఆర్పీ సిబ్బందికి అవసరమైన సహకారం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆపద సమయంలో బయటి నుంచి సహకారం అందించేలా కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి.. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనే చోరీల సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చిత్తూరు తమిళనాడు సరిహద్దుగా ఉంది. అనంతపురం, కర్నూలుకు కర్ణాటక హద్దుగా ఉన్నాయి. ఇక్కడ దోపిడీకి పాల్పడితే క్షణాల వ్యవధిలో రాష్ట్రం దాటేయొచ్చు. దర్యాప్తు ఇరు రాష్ట్రాలకు చెందిన అంశం అవడంతో దొంగలు వీటినే అనువుగా ఎంచుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు చూసినా ఒడిశా సరిహద్దు అవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కడప పోలీసుల కీలక అడుగులు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. నూతన ఆవిష్కరణలు, అమల్లో కడప పోలీసుశాఖ భద్రతకు రక్షణ కల్పించే దిశగానూ అడుగేస్తుండటం ప్రత్యేకత సంతరించుకుంటోంది. ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఈ అంశంపై కసరత్తు జరుగుతుండగా.. అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
రైళ్ల దోపిడీల సందర్భంగా ముందు జాగ్రత్తలు, నివారణకు తగిన సహకారం అందించటానికి ప్రాథమికంగా నిర్ణయించామని జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ తెలిపారు. ఏవిధంగా సహకారం అందించాలనే అంశంపై మరింత కసరత్తు చేయనున్నామని పేర్కొన్నారు.