రెండు మంచి వార్తలు :ఒకటి పద్యం , ఇంకొకటి హృద్యం

1 . పద్యం

మెదక్ జిల్లా చిన్నకోడూరు . ఇంటర్మీడియెట్ విద్యార్థిని కావ్య శతకం రాసింది . శతకం పేరు కావ్యమాల . హరీష్ రావు ఈ కావ్యాన్ని ఆవిష్కరించి , ఆ కావ్యను అభినందించారు .పద్యం బిగి , నడక , అందం , జ్ఞాపకంలో శాశ్వతంగా ఉండిపోవడానికి యతి – ప్రాసలు , శబ్దాలంకారాల గురించి ఎంత చెప్పినా తక్కువే .కానీ ఇప్పుడు పద్యం పలకలేనిదై , పలుకులేనిదై , పనికిరానిదై పాతపుస్తకాల్లో , పాత జ్ఞాపకాల్లో మిగిలిపోనుంది . వెయ్యేళ్లపాటు తెలుగు భాషను పద్యాలే తమ పదాలపాదాల మీద మోశాయి .

ఇప్పుడు మనకు ట్విన్కిల్ ట్విన్కిలే – లిటిల్ తెలుగు తేటగీతి .
రెయిన్ రెయిన్ పోవే – చిరు చినుకుల ఉత్పలమాల .
జానీ జానీ పో పాపా -పసిపిల్లల జోలపాట .
ఎప్పుడూ కూలిపోయే -లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ – తెలుగు శైశవ గీతి.

పద్యం చదివేవారు తుపాకీగుండుకు ఒక్కరయినా దొరకని అపద్యకాలంలో
వంద పద్యాలు సామాజిక అంశాలతో రాసిన కావ్యను అభినందిద్దాం . ఆశీర్వదిద్దాం . మరిన్ని మంచి పద్యాలు రాస్తూ, కావ్య చదువుల్లో కూడా బాగా రాణించాలని కోరుకుందాం .

నీవొక కావ్యమై నిలవాలి తల్లీ !
———————-

2 . హృద్యం

కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ సీ.ఐ. మాధవి . ఆమె అంతకుముందు వేములవాడ రురల్ సీ ఐ గా పనిచేస్తున్నప్పుడు ఒక నిరుపేదకుటుంబంలో భార్యాభర్తలు అనారోగ్యంతో మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు . దాతలసాయంతో మాధవి ఆ పిల్లలకు ఆశ్రయం కల్పించారు . వారిలో ఒకమ్మాయిని దత్తత తీసుకుని తన పిల్లలతోపాటు చదివిస్తున్నారు . ఈ వార్త ఇంతే . కానీ, నిజానికి ఇంతే కాదు, ఇంకా ఎంతో ఉంది.

అన్నార్థులు ,అనాథలుండని
అనవయుగమదెంత దూరమో ?
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో ?
పసిపాపల నిదురకనులలో
ముసిరిన భవితవ్యం ఎంతో ?
అని దాశరథి గేయకవిత ప్రశ్నించింది .
ఖాకీ కర్తవ్యంలో కరిగేమనసు మాధవి సమాధానమిచ్చింది .

సెల్యూట్ తల్లీ!
నీకు , నీవుపంచే ప్రేమకు .

-పమిడికాల్వ మధుసూదన్
9989090018
madhupamidikalva@gmail.com