రాష్ట్రం అంతటా అభివృద్ధి ఫలాలు

అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని అడుగులు వేస్తోంది. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని  ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇందులో భాగంగానే నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని చెప్పారు. ఆయా ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల పరిధిలో గల జిల్లాలన్నీ అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలను రూపొందించడంతో పాటు అమలు తీరు తెన్నులను పర్యవేక్షిస్తుందని ఆ అధికారి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంగా (శ్రీకాకుళం– విజయనగరం– విశాఖపట్టణం) ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. గుంటూరు కేంద్రంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. కడప కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

కేబినెట్‌ ర్యాంకుతో చైర్మన్ల నియామకం
ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు కేబినెట్‌ స్థాయి ర్యాంకులో మూడేళ్ల కాల వ్యవధికి చైర్మన్‌ నియామకం ఉంటుంది. వ్యవసాయం (ఫుడ్‌ ప్రాసెసింగ్‌–అగ్రి మార్కెటింగ్‌) నీటి నిర్వహణ, ఆర్థిక వృద్ధి – మౌలిక వసతులు, సమ్మిళిత అభివృద్ధి – సంక్షేమ రంగాలకు చెందిన నలుగురు నిపుణులను సభ్యులుగా నియమిస్తారు. అవసరమైన సిబ్బందిని కూడా ఇస్తారు. ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా మండలిని రద్దు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి.

Tags:Department of Finance Health centers, Government of AP Infrastructure, Regional planning policy, Andhra Pradesh