రావెల, ఆకులపై నిర్ణయం తీసుకుని ‘మేడా’పై స్పందించని కోడెల!

తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణల రాజీనామాలను ఆమోదించిన ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, రాజీనామా చేసిన మరో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. టీడీపీకి రాజీనామా చేసిన రావెల, బీజేపీకి రాజీనామా చేసిన ఆకుల ఇద్దరూ జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు ఎమ్మెల్యే, విప్ పదవులకు రాజీనామా చేసిన మేడా మల్లికార్జున రెడ్డి మాత్రం వైఎస్ఆర్ సీపీలో చేరారు.

కాగా, రాజీనామాలు చేసిన రావెల, ఆకుల స్పీకర్ ఫార్మాట్ లో తమ లేఖలను పంపినందునే, స్వయంగా ఫోన్ చేసి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న స్పీకర్ కోడెల శివప్రసాద్, వాటిని ఆమోదించారని, మేడా మాత్రం విప్ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి ఇంకా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించనందునే, ఆయన నిర్ణయం తీసుకోలేదని స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.