రావెలపై టీడీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇలాంటి రాజకీయాలు మేం చేయబోం!: పవన్ కల్యాణ్

రావెలపై టీడీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇలాంటి రాజకీయాలు మేం చేయబోం!: పవన్ కల్యాణ్

ఇటీవల జనసేనలో చేరిన రావెల
తీవ్రంగా విమర్శించిన టీడీపీ నేతలు
అధికార పక్షం విమర్శలను తప్పుపట్టిన నేత
జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుపై టీడీపీ నేతలు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇలాంటి సిగ్గుచేటు వ్యాఖ్యలు చేస్తూ ఏపీలోని సహృద్భావ వాతావరణాన్ని దెబ్బతిస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ప్రజలే బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. జనసేన ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ఎన్నటికీ చేయబోదని స్పష్టం చేశారు.

ఇటీవల టీడీపీని వీడిన రావెల కిశోర్ బాబు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ప్రత్తిపాడులోని నిమ్మగడ్డవారిపాలెం కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్నిటీడీపీ నేతలు పసుపునీళ్లతో కడిగారు. రావెల నిష్క్రమణతో టీడీపీకి పట్టిన మైల పోయిందని విమర్శించారు. పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని చంద్రబాబు మంత్రి హోదా కట్టబెట్టారని గుర్తుచేశారు. రాజకీయ ఆశ్రయం దొరకని నేతలే జనసేనలో చేరుతున్నారనీ, గంగిరెద్దుల్లా రంకెలు వేస్తున్నారని మంత్రి జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.