రాఫెలే మాకు రాచబాట

రాఫెలే మాకు రాచబాట

రాఫెల్ అంశం మరోసారి లోక్‌సభను కుదిపేసింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై శుక్రవారం సభలో వాడివేడి చర్చ జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సభ్యుల వాద, ప్రతివాదాలతో సభ హోరెత్తింది. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్య మాటల తూటాలు పేలాయి. విపక్షాల ప్రశ్నలకు రక్షణమంత్రి సుమారు రెండు గంటలపాటు సవివరంగా సమాధానాలిచ్చారు. రాఫెల్ విమానాల ధరల్ని కేంద్రం ఎందుకు దాచిపెడుతున్నదని, ప్రధానికి అత్యంత సన్నిహితుడైన అనిల్ అంబానీ (ఏఏ)కి ఆఫ్‌సెట్ పార్ట్‌నర్ షిప్ కాంట్రాక్టు దక్కేలా నిబంధనల్ని ఎవరు మార్చారో బయటపెట్టాలంటూ ఈ సందర్భంగా రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణల్ని రక్షణమంత్రి తిప్పికొట్టారు. యూపీఏ అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో రాఫెల్ ఒప్పందానికి తుదిరూపు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. కమీషన్ల బేరం కుదరకే ఒప్పందాన్ని పక్కనపెట్టారని ఎద్దేవా చేశారు.

రాఫెల్‌తో అధికారంలోకి..
గత ఐదేండ్లుగా రక్షణశాఖలో దళారుల (మధ్యవర్తుల) ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకతతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 1980 దశకంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బోఫోర్స్ ఘటన చోటుచేసుకుంది. బోఫోర్స్ ఒప్పందమే పెద్ద కుంభకోణం. కానీ, రాఫెల్ అలా కాదు. బోఫోర్స్ కుంభకోణం కాంగ్రెస్‌ను నిలువునా ముంచేసింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది. కానీ, రాఫెల్ ఒప్పందం రెండోసారి ప్రధానిగా నరేంద్రమోదీని అధికారంలోకి తీసుకువస్తుంది. అవినీతికి ఆస్కారంలేని సరికొత్త భారతావనిని ఆవిష్కరిస్తుంది. రాఫెల్ ఒప్పందంతో మీకు (కాంగ్రెస్) ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అందుకే వైమానిక దళ అవసరాల్ని కూడా పట్టించుకోకుండా ఒప్పందాన్ని పక్కనపెట్టారు అని విమర్శించారు. కానీ, ఎన్డీఏ సర్కారు దేశ ప్రయోజనాల కోసం ఒప్పందాన్ని పూర్తిచేసిందని చెప్పారు. యుద్ధ విమానాల సంఖ్యను 126 నుంచి 38కి తగ్గించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి బూటకమని విమర్శించారు.
డిఫెన్స్ డీలింగ్స్‌కు.. డీలింగ్ ఇన్ డిఫెన్స్‌కు చాలా తేడా ఉంది. కాంగ్రెస్‌కు డిఫెన్స్ డీలింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందులో వారికి కమీషన్లు లభిస్తాయి. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందంలో అనేక లోపాలున్నాయి. దేశ రక్షణ కంటే వాళ్లకు వారి ఖజానా రక్షణే ముఖ్యం. మీరు కావాలనే ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. భారత వాయుసేన ఇబ్బందుల్ని పట్టించుకోలేదు. ఒప్పందానికి తుదిరూపు ఇవ్వలేదు. కావాలనే తాత్సారం చేశారు. ఎందుకంటే మీకు (కాంగ్రెస్) ఆ ఒప్పందం కాసులు కురిపించలేదు. కమీషన్లు రాల్చలేదు. అందుకే అసంపూర్తిగా వదిలేశారు అని దుయ్యబట్టారు. ఒప్పందంపై కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు కమీషన్లు ముఖ్యమని, కానీ, తమకు దేశ ప్రయోజనాలే పరమావధి అని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఏఏ సరే.. మరి క్యూ, ఆర్‌వీ మాటేమిటి?
తాము ఏఏ (అనిల్ అంబానీ)కి లబ్ధి చేకూర్చడం కోసమే డీల్ కుదుర్చుకున్నామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపణలపై మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల వెనుక క్యూ (ఖత్రోచీ), ఆర్‌వీ (రాబర్ట్ వాద్రా) ఉన్నారు. మరి, వారి మాటేమిటి? ఈ అంశాలపై రాహుల్ సమాధానం చెప్పాలి అని నిలదీశారు. ప్రధాని మోదీని అబద్ధాల కోరు, దొంగ అంటూ కాంగ్రెస్ నేతలు, రాహుల్ విమర్శించడంపై రక్షణమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా విమర్శించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే తాను కలిశానని రాహుల్ చెబుతున్నారని, ఆయన ఎప్పుడు, ఎక్కడ కలిశారో ఆధారాలు చూపాలని కోరారు.
2022 నాటికి భారత్‌కు 32 యుద్ధ విమానాలు
ఫ్రాన్స్‌లో రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ ఏడాది సెప్టెంబర్‌లో తొలి యుద్ధ విమానం భారత్‌కు చేరుకుంటుందని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022 నాటికి మొత్తం 36 విమానాలు భారత అమ్ములపొదిలో చేరుతాయని స్పష్టం చేశారు. ఈ మొత్తం ఒప్పందం కార్యరూపం దాల్చడానికి 14 నెలల సమయం పట్టిందన్నారు. కాంగ్రెస్ హయాంలో 18 యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకోగా, తాము 36 విమానాల్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండే స్థితిలో తీసుకునేందుకు అంగీకరించామని చెప్పారు. విమానాల ధరల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. యూపీఏ హయాంలో ఒక్కో యుద్ధ విమానం ధరను రూ.737 కోట్లకు కోట్ చేస్తే.. మేం అంతకంటే 9 శాతం తక్కువకు రూ.670 కోట్ల ధరను నిర్ణయించామని చెప్పారు. ఒక్కో విమానం ధరను రూ.526 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు పెంచామని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఇది ఎలా ఉందంటే ఆపిల్ పండ్లను, నారింజ పండ్లను ఒకే గాటన కట్టినట్లుగా ఉంది. 2007లో యూపీఏ కుదుర్చుకున్న ధరకు .. ప్రస్తుతం 2016లో ఎన్డీఏ సర్కారు చేసుకున్న ఒప్పందంలోని ధర ఒకేలా ఎలా ఉంటుంది? ధరల పెరుగుదల, ఎక్చ్సేంజ్ రేట్ వ్యత్యాసాలు తప్పకుండా ఉంటాయి. అసలు సాధారణ విమానాల ధరలను.. యుద్ధ విమానాల ధరలతో ఎలా పోలుస్తారు? అని ప్రశ్నించారు.

హాల్‌పై కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు
రాఫెల్ ఒప్పందంలో ఆఫ్‌సెట్ కాంట్రాక్టు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్-హాల్)కు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తున్నదని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో హెచ్‌ఏఎల్‌కు ఎందుకు కాంట్రాక్టులు కట్టబెట్టలేదని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ సంస్థకు సుమారు రూ.లక్ష కోట్ల కాంట్రాక్టులు అప్పజెప్పామని తెలిపారు. రాఫెల్ వ్యవహారంలో దేశాన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నది. ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్దాలే. మా హయాంలో హాల్ సామర్థ్యాన్ని మెరుగుపరిచాం. విమానాల కొనుగోలు సయమంలో హాల్‌ను నాటి యూపీఏ సర్కారు పక్కనపెట్టింది. ఫ్రాన్స్ విమాన తయారీ సంస్థ దస్సాల్ట్, హాల్ మధ్య ఎలాంటి ఒప్పందం జరుగలేదు. తేజస్ విషయంలో హాల్ మందకొడిగా వ్యవహరించింది. మేం 43 విమానాలకు ఆర్డర్ ఇస్తే సంస్థ కేవలం ఎనిమిది విమానాలనే అందజేసింది. హాల్ ఏడాదికి ఎనిమిది విమానాలకు మించి తయారు చేయలేదు. మరి, మీ హయాంలో హాల్‌ను పక్కనపెట్టి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు అని ఆమె ప్రశ్నించారు.