రాజమౌళి అలా ఆలోచిస్తారు .. అదే ఆయన గొప్పతనం: అనంత్ శ్రీరామ్

రాజమౌళి గారు తగిన సమయాన్ని ఇస్తారు
వెంటనే కావాలని తొందర పెట్టరు
పాట రెడీ అయ్యాకే షూటింగు పెడతారు
పాటల రచయితగా ఎంతోమంది దర్శకులతో కలిసి అనంత్ శ్రీరామ్ పనిచేశాడు. తాజాగా ఆయన ‘చెప్పాలని వుంది’ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాజమౌళిని గురించి ప్రస్తావించాడు. “రాజమౌళి – కీరవాణిగార్లతో కలిసి పనిచేయడం చాలా సవాలుగా .. సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. రాజమౌళిగారు ఒక పాట ఇచ్చారంటే .. ఆ పాట రాయడానికి తగిన సమయాన్ని ఇస్తారు.

పాట పూర్తయిన తరువాతనే షూటింగుకి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు గానీ, షూటింగ్ ఫలానా రోజున పెట్టేసుకున్నామని చెప్పేసి తొందరపెట్టరు. పాట తాను అనుకున్నట్టుగా వచ్చేవరకూ ఆయన చాలా ఓపికగా వేచి చూస్తారు. ఈ రచయిత దగ్గర ఆలస్యమవుతుందేమో .. ఆయనని అలా రాయనిద్దాం .. ఆయనకి తెలియకుండగా మరో రచయితకి కూడా ఇద్దాం అనుకునేవారు కాదు. ఈ పాటను ఈ రచయితతో రాయించుకుందాం అని ఆయన ఒకసారి అనుకుంటే, ఎంతకాలమైనా అదే రచయిత ఆ పాటను రాస్తాడు. రచయితకి అంతటి అవకాశం .. సమయం ఇవ్వడమే రాజమౌళిగారిలోని గొప్పతనం” అని చెప్పుకొచ్చాడు.