రాజకీయాల కోసమే ముందస్తు… తేల్చి చెప్పిన గులాబీ బాస్

తెలంగాణ అసెంబ్లీ ఎందుకు ర‌ద్దు చేశారు..? ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎందుకు కేసీఆర్ వెళ్లారు..? నిజానికి, ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెరాస నుంచి ల‌భించ‌కుండానే… ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా పూర్తికాబోతున్న స‌మ‌యం వ‌చ్చింది. అయితే, ఇదే అంశ‌మై మొద‌ట్నుంచీ కేసీఆర్ గానీ, ఇత‌ర తెరాస నేత‌లుగానీ చెప్పిన కార‌ణం ఏంటంటే… కాంగ్రెస్ పార్టీ తీరు! తాము చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్నార‌నీ, కేసులు వేస్తున్నార‌నీ, అందుకే ప్ర‌జ‌ల నుంచే మ‌రోసారి ఆమోదం పొందాల‌నే ఉద్దేశంతోనే అసెంబ్లీ ర‌ద్దు చేశామని కేసీఆర్ చెబుతూ వ‌చ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా అదే ప్రముఖంగా ప్ర‌జ‌ల‌కు చెప్పారు. అయితే, ఒక జాతీయ వార్తా సంస్థ‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏమ‌న్నారంటే… ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి కార‌ణం..

త‌న జాతీయ రాజ‌కీయ ఆలోచ‌న‌లే అన్నారు. అసెంబ్లీ ర‌ద్దుకి కార‌ణ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తే… ముందుగా అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తి చేసుకోవాల‌నీ, ఆ త‌రువాత జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాల్సి ఉంద‌న్నారు కేసీఆర్‌. జాత‌కాలు, మూఢ‌న‌మ్మ‌కాలు అనుస‌రించి తాను అసెంబ్లీ ర‌ద్దు చెయ్య‌లేద‌న్నారు. ఈ ఎన్నిక‌ల్ని ముందుగా ముగించేస్తే, జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌గ‌ల‌ను అన్నారు. భాజ‌పా, కాంగ్రెస్ ల‌తో త‌న పొత్తు ఎప్పుడూ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో తాను కాంగ్రెస్‌, భాజ‌పాల‌తో క‌లిసిన సంద‌ర్భాలున్నాయ‌నీ.. తెలంగాణ సాధ‌న కోసం అందరి మద్దతు అవ‌స‌రం నాడు ఉంద‌న్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లతోపాటు కొన్ని అంశాల్లో కేంద్రంలోని భాజ‌పాకి మ‌ద్ద‌తు ఇచ్చారు క‌దా అని రాజ్దీప్ ప్ర‌శ్నిస్తే…

అవి అంశాలవారీ మ‌ద్ద‌తు మాత్ర‌మేగానీ, రాజ‌కీయంగా పొత్తు కాద‌న్నారు. దేశానికి ప్ర‌ధాని మోడీ కాబ‌ట్టి, రాష్ట్రానికి తాను ముఖ్య‌మంత్రి కాబ‌ట్టి.. పాల‌నాప‌ర‌మైన అవ‌స‌రాల కోసం తాము కొన్నిసార్లు క‌లిశామ‌న్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత ఢిల్లీ వెళ్తాన‌నీ, త‌న అజెండాను అక్క‌డ ప్ర‌క‌టిస్తా అని చెప్పారు కేసీఆర్‌. అసెంబ్లీ ర‌ద్దుకి కార‌ణం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నిక‌ల రాష్ట్రమంతా డ‌ప్పేసి చాటారు. ఇప్పుడేమో, అస‌లు విష‌యాన్ని తీరిగ్గా కేసీఆర్ చెబుతున్నారు! అంటే.. అసెంబ్లీ ర‌ద్దుకి అస‌లు కార‌ణం కేసీఆర్ కి ఉన్న జాతీయ రాజ‌కీయ ఆస‌క్తి మాత్ర‌మే అన్నమాట. ఆ మాట‌ను ఆయ‌నే స్వ‌యంగా ఒప్పుకున్నారు. మ‌రైతే… ఇన్నాళ్లూ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ని బూచిగా చూపిస్తూ చేసిన ప్ర‌చారాన్ని ఏమ‌నుకోవాలి..? అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌లు వ‌స్తే… ఒకేసారి రెంటిపైనా ఫోక‌స్ చేయ‌లేర‌ట‌! అందుకే, ముందుగా ఈ తంతును అవ‌గొట్టేద్దాం అనుకున్నార‌ట‌. త‌న వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ల‌క్ష్యం కోసం అసెంబ్లీని ప‌ద‌వీ కాలం కంటే ముందుగా ర‌ద్దు చేశాన‌ని ముఖ్య‌మంత్రే స్వ‌యంగా చెప్తే ఏమ‌నుకోవాలి..?
Tags: mundhasthu, kcr and ktr, telangana, elections 2018, results