రాజకీయాలు మాకు తెలియవా? గడ్డాలు మాకూ నెరిశాయ్!: ఆగ్రహంతో ఊగిపోయిన పవన్

టీడీపీ నేతలు వెనక నుంచి ఏం చేస్తున్నారో మాకు తెలుసు
మా అండతో గెలిచి మమ్మల్నే అంటారా?
మా గడ్డాలకు రంగేసుకుంటున్నామంతే
జనసేన పోరాట యాత్రలో భాగంగా ఇచ్చాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఒకానొక దశలో ఆవేశంతో ఊగిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రతీ జనసేన కార్యకర్త చెమటోడ్చినట్టు చెప్పారు. తమ కార్యకర్తలు అండగా నిలబడడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. జనసేన అండతో గెలిచిన ఎమ్మెల్యేలు నేడు తమకు వ్యతిరేకంగా మాట్లాడడం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఏ రోజూ తమకు మర్యాద అనేది ఇవ్వలేదని, బయటకు కనిపించే మర్యాద తమకు అవసరం లేదని అన్నారు. వెనక నుంచి వారేం చేస్తున్నారో తమకు అంతా తెలుసని పేర్కొన్నారు. తామేమీ రాజకీయాలు తెలియని చిన్నపిల్లలం కామని, తమకూ గడ్డాలు నెరిశాయని, కాకపోతే రంగు వేసుకుంటున్నామంటూ ఆవేశంతో ఊగిపోయారు. పవన్ ఆ మాట అనగానే అభిమానులు, కార్యకర్తలు కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది.