రహస్యంగా పెళ్లి చేసుకుని మోసం… అత్తింటి ముందు బైఠాయించిన యువతి!

హైదరాబాద్ లో పని చేస్తున్న దేవీ కుమారి, వెంకటేశ్వర్లు
రహస్యంగా గుడిలో వివాహం
ఆపై తీసుకెళ్లకపోవడంతో యువతి నిరసన
ఒకే చోట తనతో కలసి పని చేస్తున్న వ్యక్తి, ప్రేమిస్తున్నానని చెప్పి, రహస్యంగా పెళ్లి చేసుకుని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఓ యువతి అత్తింటి ముందు బైఠాయించింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, విజయనగరం జిల్లాకు చెందిన దేవీకుమారి, ముండ్లమూరు ప్రాంతానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో కలసి పని చేస్తున్నారు. ఇద్దరి మధ్యా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో, పెళ్లి చేసుకోవాలని భావించారు. గత నెలలో దేవీ కుమారి, వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చి మాట్లాడగా, వారు పెళ్లికి అంగీకరించకుండా, సర్దిచెప్పి తిరిగి పంపించారు. ఆపై తనను విడిచి ఉండలేనని చెబుతూ వెంటేశ్వర్లు ఓ గుడిలో తనను పెళ్లాడాడని దేవి చెబుతోంది.

పెళ్లయి నెల రోజులు గడుస్తున్నా వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో, ఆ అమ్మాయి అత్తారింటికి వచ్చింది. ఇంటి ముందు నిరసనకు దిగింది. పోలీసులు వచ్చి విచారించగా, తనకు కేసులు వద్దని, న్యాయం చేయాలని కోరింది. వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తనకు రెండు నెలల క్రితమే మరో అమ్మాయితో పెళ్లి జరిగిందని, దేవీ కుమారితో తనకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పోలీసులు, వారు వచ్చిన తరువాత తదుపరి విచారణ కొనసాగిస్తామని అంటున్నారు.