రష్యన్లు మన ఈవీఎంలను హ్యాక్ చేస్తారు: చంద్రబాబు

రష్యన్లు మన ఈవీఎంలను హ్యాక్ చేస్తారు: చంద్రబాబు

Share This

కోట్ల రూపాయలిస్తే గెలిపిస్తామని చెబుతున్నారు
ఎన్నో విధాలుగా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు
ప్రపంచంలో 18 దేశాలు మాత్రమే ఈవీఎంలను వాడుతున్నాయి
ఈవీఎంల హ్యాకింగ్ కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి వచ్చిన వ్యక్తులు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని తాను నిర్ధారించలేకపోయినా, కోట్ల రూపాయలను చెల్లిస్తే కచ్చితంగా గెలిపిస్తామని వారు చెబుతున్నట్టు తెలిసిందని అన్నారు.

ఎన్నో విధాలుగా ఈవీఎంలను చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చని తెలిపారు. ప్రపంచంలో కేవలం 18 దేశాలు మాత్రమే ఈవీఎంలను వాడుతున్నాయని, మిగిలిన దేశాలన్నీ వాటికి దూరంగా ఉన్నాయని చెప్పారు. ముంబైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

వీవీప్యాట్ లలో ఉన్న స్లిప్పులన్నింటినీ లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఈవీఎంలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. గోవా, యూపీ, కేరళ నుంచి కూడా ఈవీఎంలకు సంబంధించిన ఫిర్యాదులు తమకు అందాయని చెప్పారు.