రవాణా శాఖ కానిస్టేబుల్‌కు రూ.15కోట్ల ఆస్తులు

అనంతపురం నేరవార్తలు: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో రవాణా శాఖ కానిస్టేబుల్‌ రవీంద్రనాథ్‌రెడ్డి నివాసంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు(అనిశా) మంగళవారం దాడులు నిర్వహించారు. 1990లో రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరిన రవీంద్రనాథ్‌రెడ్డి.. ప్రస్తుతం గుంతకల్లు రవాణాశాఖ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సోదాల్లో కిలో బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి, 14 నివాస స్థలాల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవీంద్రారెడ్డికి అనంతపురంలోని జీసెస్‌ నగర్‌లో రెండు అంతస్తుల భవనం, తాడిపత్రిలో మూడు భవనాలు, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రవీంద్రారెడ్డి బ్యాంకు ఖాతాలను, లాకర్లను తనిఖీ చేయాల్సి ఉందని డీఎస్పీ జయరాజ్‌ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మార్కెట్‌ ప్రకారం రూ.15 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.