యూట్యూబ్ వీడియోలు చూసి కాన్పు, గర్భిణి మరణం

ఇంటి దగ్గర ప్రసవం మంచిదేనా?

గర్భవతిగా ఉన్న 9 నెలలూ కృతిక ఆస్పత్రికి వెళ్లలేదు
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఓ మహిళ తన ఇంట్లోనే బిడ్డకు జన్మనిస్తూ చనిపోయింది. ఆ ఘటన రాష్ట్రంలో ఆందోళనతో పాటు ఆశ్చర్యాన్ని కూడా రేకెత్తిచ్చింది. ఆ మహిళ భర్తతో పాటు అతడి స్నేహితులు యూట్యూబ్‌లో వీడియోలు చూసి అలానే ఆ మహిళకు ప్రసవం చేయాలని చూడటమే దానికి కారణం. కానీ ఆ ప్రయత్నం వికటించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తిరుపూర్‌కు చెందిన కృతిక టీచర్‌గా పనిచేసేవారు. ఆమె భర్త కార్తికేయన్ స్నేహితుడైన ప్రవీణ్ సలహా మేరకు కృతిక ఆస్పత్రికి వెళ్లలేదని తెలుస్తోంది. తన భార్యకు సహజ కాన్పు అయిందని, వాళ్లు కూడా ఇంట్లోనే కాన్పుకు ప్రయత్నిస్తే మంచిదని ప్రవీణ్, అతడి భార్య లావణ్య కలిసి కార్తికేయన్ దంపతులకు సలహా ఇచ్చారు.

కార్తికేయన్ కూడా దానికి అంగీకరించడంతో కృతిక గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలలూ ఆస్పత్రికి వెళ్లలేదు. ప్రసవ సమయంలో ఇబ్బంది తలెత్తడంతో ముగ్గురూ కలిసి యూట్యూబ్‌లో వీడియోలను చూసి కృతికకు ప్రసవం చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. కానీ ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువగా జరగడంతో ఆమె చనిపోయారు. ఈ ఘటన గురించి తెలుసుకొని తాను షాకయ్యాననీ, వాళ్లలా ప్రయత్నించి ఉండాల్సింది కాదని ప్రముఖ గైనకాలజిస్ట్ కమలా సెల్వరాజ్ అన్నారు. ‘ప్రసవ సమయంలో ఏ మహిళకు ఎంత రక్తం అవసరమవుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే మేం ఎక్కువ రక్తాన్ని అందుబాటులో ఉంచుకుంటాం. ఇంటి దగ్గర అలా చేయడం కుదరదు కదా. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మంత్రసానులు ఇంటికొచ్చి ప్రసవం చేసేవారు. వాళ్లకు కొద్దో గొప్పో ఆ పనిలో నేర్పు ఉండేది. కానీ ఎలాంటి అనుభవం లేకుండా ప్రయత్నించడం మాత్రం తల్లీబిడ్డల ప్రాణాలతో చెలగాటమే’ అని ఆమె అన్నారు.

ప్రసవ సమయంలో వైద్యుల దగ్గరక వెళ్లడం అవసరం అని చెప్తున్న డా.కమల గర్భిణులు పాటించాల్సిన కొన్ని సూచనలు చేస్తున్నారు.

వ్యాయామం: తల్లులకు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చాలా ముఖ్యం. రోజూ ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసపైన నియంత్రణ పెరుగుతుంది. కింద కూర్చొని కూరగాయలు కోయడం, నేలమీదే భోజనం చేయడం లాంటి పనుల వల్ల శరీర కదలికలు మెరుగవుతాయి. కూర్చొని లేవడం వల్ల నడుము కింది భాగంలోని ఎముకలు, కండరాలు వ్యాకోచిస్తాయి. దీని వల్ల ప్రసవ సమయంలో బిడ్డ తల సులువుగా బయటికొస్తుంది. వీటితో పాటు శరీర కండరాలకు పనిచెప్పే ఎలాంటి కదలికలైనా మంచిదే.

ఆహారం: సహజ సిద్ధమైన ఆహారం తల్లులకు చాలా అవసరం. ముఖ్యంగా రోజూ ఏదో ఒక రకమైన ఆకు కూర, పండు, నట్స్ తీసుకోవడం తప్పనిసరి. ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. యోగా ద్వారా మంచి నిద్ర పడుతుంది. ఇవన్నీ సహజ కాన్పుకి మార్గం కల్పిస్తాయి అని కమల అంటున్నారు. ఇవన్నీ చేసినా కూడా కొందరు లేనిపోని భయాలు, పరిమితుల వల్ల సిజేరియన్‌నే ఆశ్రయిస్తున్నారని శ్యామలా అనే వైద్యురాలు చెబుతున్నారు. తిరుపూర్‌లో ఆ మహిళ చనిపోవడానికి అధిక రక్తస్రావమే కారణమై ఉండొచ్చని ఆమె భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి దగ్గర ప్రసవానికి ప్రయత్నించడం ఏమాత్రం మంచిది కాదని ఆమె సూచిస్తున్నారు.

సి-సెక్షన్ ఎప్పుడు?

కడుపులోని బిడ్డ తల మరీ పెద్దగా ఉండి సహజంగా బయటకు రావడానికి వీలు కాని సందర్భాల్లో వైద్యులు సి-సెక్షన్‌కు సిఫారసు చేస్తారు. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, పేగు మెడకు చుట్టుకుపోయినప్పుడు కూడా ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. తల్లిదండ్రులు సహజ కాన్పువైపే మొగ్గు చూపినా, కొన్నిసార్లు వైద్యులే తల్లీబిడ్డల క్షేమం కోసం శస్త్ర చికిత్సను సూచిస్తుంటారు.

సి సెక్షన్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?

‘ప్రస్తుతం జీవనశైలి చాలా మారిపోయింది. ఎవరూ సమయానికి తినడం లేదు, నిద్ర పోవడం లేదు. ఆహార అలవాట్లు కూడా మారిపోయాయి. శారీరక శ్రమ తగ్గిపోయింది. ఒత్తిళ్లు పెరిగిపోయాయి. ఇవన్నీ సిజేరియన్‌లు పెరగడానికి కారణమే. ఈ తరం వాళ్లు కొందరు ప్రసవ వేదనను భరించడానికి సిద్ధపడట్లేదు. అందుకని వాళ్లే సి-సెక్షన్ కావాలని కోరుకుంటున్నారు’ అని డాక్టర్ శ్యామల అన్నారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే చికిత్సతో పాటు రోగులకు కౌన్సిలింగ్‌ కూడా ముఖ్యమని శ్యామల చెబుతున్నారు. ‘కొన్ని దశాబ్దాల క్రితం ఇళ్లలోనే ప్రసవాలు జరిగేవి. కానీ అప్పట్లో శిశు మరణాల సంఖ్యా ఎక్కువగానే ఉండేది. వైద్య సౌకర్యాలు పెరిగాక ఆ మరణాలు తగ్గాయి. ఇంటి దగ్గరే ప్రసవం చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలూ ఉంటాయి’ అని శ్యామల అన్నారు.

యూట్యూబ్‌లో ఇళ్ల దగ్గరే ప్రసవానికి సంబంధించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా ఉంటాయనీ, కానీ వాటిని ప్రయత్నించడం ప్రమాదకరమని ఆమె సూచిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయంలోనైనా వైద్యులను ఆశ్రయించడమే మంచిదని ఆమె అంటున్నారు.