యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు

సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. పార్టీ నాయకులకు సూచించారు. ప్రగతి నివేదన సభాస్థలిని సీఎం శుక్రవారం పరిశీలించి.. జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. సభ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎంకు వివరించారు. సభాస్థలానికి రావడానికి అన్ని వైపుల నుంచి 15 నుంచి 20 రహదారులు నిర్మించాలని ఈ సందర్భంగా సీఎంచెప్పారు. కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వశాఖల నుంచి అనుమతి తీసుకోవాలని, పార్టీ నిధులనే వినియోగించాలని సూచించారు. సభాస్థలి చుట్టూ కూడా రాకపోకలు సులభంగా ఉండేందుకు దారులను నిర్మించాలన్నారు. వేల వాహనాలు వచ్చే అవకాశమున్నందున ట్రాఫిక్ జామ్ లేకుండా కొత్త రోడ్లను నిర్మించాలని, వాటి ఖర్చును పార్టీయే చెల్లిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం వెంట టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కే తారకరామారావు, పీ మహేందర్‌రెడ్డి, సీ లక్ష్మారెడ్డి, ఎంపీలు జోగినిపల్లి సంతోష్‌కుమార్, బాల్క సుమన్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్, పట్నం నరేందర్‌రెడ్డి, రాములునాయక్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జీవన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, టీఎస్‌టీఎస్సీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాధవరెడ్డి తదితరులున్నారు.

జోరుగా పనులు

ప్రగతి నివేదన సభ నిర్వహణకు ఏర్పాట్లు శుక్రవారం ఉదయం నుంచి జోరందుకున్నాయి. 480 ఎకరాల్లో నిర్వహించే సభలో 46 లక్షల మంది కూర్చునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభ వేదికను 500 మంది కూర్చునేలా పటిష్ఠంగా నిర్మించనున్నారు. వేదికను అందంగా తీర్చిదిద్దడంపై బొంతు రామ్మోహన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలమల్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 25 లక్షల మంది హాజరయ్యే ఈ సభకు కనీసం లక్ష వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. వాటికోసం 16 పార్కింగ్ స్థలా లు గుర్తించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడింగ్, రోడ్డు పొడవునా మంచినీటి సౌకర్యం కల్పించడంతోపాటు మైక్, ఎల్‌ఈడీ స్క్రీన్లు సిద్ధంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ సభాస్థలానికి చేరుకోవడానికి వీలుగా వేదిక పక్కనే హెలిప్యాడ్ నిర్మించనున్నారు. రాచకొండ పోలీస్ కమిషర్ మహేశ్‌భగవత్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రాంగణం మొత్తం కలియ తిరిగి, స్థానిక పోలీసులకు పలు సూచనలుచేశారు.
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: బొంతు రామ్మోహన్

ప్రగతి నివేదన సభకు రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది వరకు వస్తారని, వారందరికీ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సభా స్థలానికి ప్రస్తుతం ఏడు అప్రోచ్ రోడ్లు ఉన్నాయని, వాటికి అదనంగా మరో 13 రోడ్లను ఏర్పాటుచేయాలని సీఎం సూచించారని తెలిపారు. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు.