మోసం చేసిన ‘మేక్ మై ట్రిప్’పై రూ. 10 లక్షల జరిమానా!

తమను నమ్ముకున్న టూరిస్టులను నిలువునా ముంచేసిన ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీ ‘మేక్ మై ట్రిప్’పై భారీ జరిమానాను విధిస్తూ, హైదరాబాద్ కన్స్యూమర్ ఫోరమ్ తీర్పిచ్చింది. వీసాలు రాకముందే డబ్బులు వసూలు చేయడం, టికెట్లను ఇప్పించలేకపోగా, డబ్బు తిరిగి ఇవ్వకపోవడం నేరమేనని, ఈ కేసులో మొత్తం ఏడుగురు టూరిస్టులు చెల్లించిన రూ. 4.48 లక్షలకు అదనంగా మరో రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ఫోరమ్ తీర్పిచ్చింది. మరో రూ. 20 వేలను కోర్టు ఖర్చుల కింద కట్టాలని ఆదేశించింది.

విజయ్ మోర్, విశాల్ గుప్తా అనే ఇద్దరు, తమవారితో కలిసి సౌతాఫ్రికా సందర్శించాలని భావించి, మేక్ మై ట్రిప్ కు టికెట్ ఖర్చుల కింద డబ్బులు చెల్లించారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు వారికి వీసాలు లభించలేదని సదరు ట్రావెల్ సంస్థ సమాచారం ఇచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితులు వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించారు. టికెట్ కు చెల్లించాల్సిన డబ్బును తిరిగి చెల్లిస్తామన్నా ఫిర్యాదిదారులు తీసుకునేందుకు నిరాకరించారని, వారు సరైన పత్రాలు సమర్పించనందునే వీసాలు రాలేదని ‘మేక్ మై ట్రిప్’ తరఫున న్యాయవాదులు వాదించినా ఫలితం లేకపోయింది.

సంస్థ చూపించిన బ్రోచర్ లో వీసాలను ఇప్పిస్తామంటూ స్పష్టంగా చెప్పారని, సరైన పత్రాలను వారి నుంచి తీసుకోవడంలో బాధ్యతగా వ్యవహరించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వీసా రాకుండా టికెట్ బుక్ చేస్తామంటూ డబ్బెందుకు తీసుకున్నారని ప్రశ్నించిన ఫోరమ్, జరిమానాను విధిస్తూ తీర్పిచ్చింది.