మోదీ నా కన్నా జూనియర్.. అయినా సర్ అని పిలిచాను!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మోదీ రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయినా కూడా తాను సర్ అని పిలిచానని, కేవలం ఆయన అహాన్ని సంతృప్తి పరచడానికే తానిలా చేశానని బాబు అన్నారు. అఖిలపక్ష సమావేశంలో భాగంగా బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కూడా నేను మిస్టర్ క్లింటన్ అని పిలిచాను తప్ప సర్ అనలేదు. మోదీ రాజకీయాల్లో నాకంటే జూనియర్. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన సమయంలో పదిసార్లు ఆయనను సర్ అని పిలిచాను. రాష్ట్రం కోసం, ఆయన అహాన్ని సంతృప్తి పరచడం కోసం ఈ పని చేశాను. ఇప్పటికైనా ఆయన రాష్ర్టానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నా అని బాబు అన్నారు. 2014లో బీజేపీతో పొత్తు కూడా రాష్ట్రం కోసం తీసుకున్న నిర్ణయమే అని స్పష్టం చేశారు. అసలు బీజేపీతో పొత్తు లేకుంటే మరో పది స్థానాలు అదనంగా గెలిచేవాళ్లమని చెప్పారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ దిగిపోవాలని మొట్టమొదట డిమాండ్ చేసింది తానేనని, అది దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు ఏపీపై కక్ష సాధిస్తున్నారని బాబు ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులందరినీ మోదీ కేసులతో వేధిస్తున్నారని అన్నారు.