'మోదీ - చిప్ప' ఫొటో పోస్ట్ చేసినందుకు... జైలులో 'కట్టప్ప' తొలిరాత్రి!

‘మోదీ – చిప్ప’ ఫొటో పోస్ట్ చేసినందుకు… జైలులో ‘కట్టప్ప’ తొలిరాత్రి!

  • ఎవరో పంపిన ఫొటోను ఫార్వార్డ్ చేసిన సత్యరాజ్
  • వైరల్ కావడంతో బీజేపీ నేతల కేసులు
  • జైల్లో నిద్రించలేదన్న అధికారి

తనకు ఎవరో పంపిన ఓ ఫొటోను పోస్టు చేసి, తీవ్ర విమర్శలపాలై, అరెస్టై, రిమాండ్ కు వెళ్లిన సినీ నటుడు, ‘కట్టప్ప’ సత్యరాజ్, తన తొలిరోజును జైలులో నిద్రలేకుండా గడిపారు. ‘బాహుబలి’ చిత్రంలో కట్టప్పగా నటించి పేరు తెచ్చుకున్న నటుడు, ఎండీఎంకే నాగపట్టణం జిల్లా ఇన్ చార్జ్‌ సత్యరాజ్‌ అలియాస్‌ బాలును నిన్న తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనను వ్యతిరేకిస్తూ, ఆయన ఓ చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నట్టు ఉన్న ఫొటోను సత్యరాజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వ్యంగ్య చిత్రాన్ని ఆయన, 26న పోస్ట్ చేయగా, ఇది వైరల్ గా మారింది. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. జైలులో ఆయన చాలా అసౌకర్యంగా కనిపించారని, ఏమీ తినలేదని జైలు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

కాగా, సత్యరాజ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఆ ఫేక్ ఫొటోను తయారు చేసింది సత్యరాజ్ కాదు కాబట్టి, ఆయనకు నేడు బెయిల్ లభిస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.