మోదీజీ.. మీరు ఇంకా నవ్వాలి

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన అవిశ్వాసం వీగింది. 325 మంది లోక్‌సభ సభ్యుల మద్దతుతో ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాసంలో నెగ్గింది. తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గత శుక్రవారం లోక్‌సభలో చర్చ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా.. చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ 90 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై సోషల్‌మీడియాలో ప్రశంసల జల్లు కురిసింది.

ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ మోదీని అభినందిస్తూ.. ఆసక్తికర సూచన ఒకటి చేశారు. అయితే ఈ ట్వీట్‌కు ప్రధాని సమాధానం ఇవ్వడం విశేషం. మోదీ లోక్‌సభ ప్రసంగంపై శిల్పి అగర్వాల్‌ అనే నెటిజన్‌ స్పందిస్తూ.. ‘ఒకే ఒక్క విషయం మోదీజీ.. మీరు ఇంకా నవ్వాలి. మిగతావన్నీ బాగున్నాయి’ అని ట్వీట్‌ చేశారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. ‘ఈ పాయింట్‌ను గుర్తుపెట్టుకుంటాను’ అని సమాధానమిచ్చారు.

దీనికే కాదండోయ్‌.. పలువురు నెటిజన్ల ట్వీట్లకు కూడా మోదీ సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ట్విటర్‌లో ఫాలోయింగ్‌ ఎక్కువే. కానీ అభిమానుల ట్వీట్లకు మాత్రం ఆయన తక్కువగా స్పందిస్తూ ఉంటారు. అయితే ఆదివారం చాలా మందికి ఆయన సమాధానమివ్వడం ఆసక్తికరంగా మారింది. స్వచ్ఛభారత్‌పై వ్యాసం రాసి తన కుమార్తె పోటీల్లో నెగ్గిందని ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌కు బదులిస్తూ.. ‘చాలా ఆనందంగా ఉంది. మీ కుమార్తెకు నా తరఫున అభినందనలు తెలపండి. స్వచ్ఛభారత్‌పై యువతలో అవగాహన పెరగడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.