మేనరికాలపైనే మక్కువ!

దేశ సగటు కంటే తెలంగాణలోనే అధికం
అధికశాతం బాలికలు ఇంటి పనులకే పరిమితం
వ్యాధులు, వైద్య ఖర్చులు మహిళలకే అధికం..
ప్రాణాలు హరిస్తున్న జీవనశైలి వ్యాధులు
తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక-2018 వెల్లడి
బాలికలు, మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకున్నంత వేగంగా మారడంలేదు. సంప్రదాయాలు, కట్టుబాట్లతోపాటు నిరక్షరాస్యత, పేదరికం కారణంగా ఇంకా చాలాచోట్ల మహిళలపై వివక్ష కొనసాగుతోంది. చదువుకోవాలని ఆశపడినా చాలాచోట్ల బాలికలను ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారు. పది పూర్తయితే చదువు అటకెక్కించి అత్తారింటికి పంపిస్తున్నారు. పాఠశాల విద్య వరకు బాలురతో పోటీపడుతున్నా, ఉన్నత చదువులకు అడ్డుపుల్లలు పడుతున్నాయి. తగిన వయసు రాకముందే పెళ్లి చేసి పంపేయడం.. మేనరికాల వంటివి జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయి. ప్రణాళికశాఖ సూచన మేరకు ‘కౌన్సెల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ (సీఎస్‌డీ)’ ఆధ్వర్యంలో ఇలాంటి పలు వివరాలతో ‘తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక-2018’ రూపొందించారు. పలు అంశాలపై 1991 నుంచి 2016 వరకు గణాంకాలను సరిపోల్చి లోతైన అధ్యయనం చేశారు. సీఎస్‌డీకి చెందిన కల్పనా కన్నబీరాన్‌, పద్మినీ స్వామినాథన్‌, జయరాజన్‌ ఈ నివేదిక రూపొందించారు. విద్య, ఆరోగ్యం, పని.. తదితర రంగాల్లో మహిళల పరిస్థితి, వివక్ష అంశాలతోపాటు ఆరోగ్యం, వైద్యం గురించి కూడా ప్రస్తావించారు. జీవనశైలి వ్యాధుల కారణంగా మృత్యువాత పడుతున్నవారి సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించారు. సగటు ప్రజలకు వైద్య ఖర్చులు భారంగా మారాయని, పురుషుల కంటే మహిళలకయ్యే వైద్య వ్యయం ఎక్కువగా ఉంటోందని, ప్రసవ ఖర్చుల్లోనూ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అధికంగా వసూలు చేస్తున్నారని వివరించారు.మహిళల సాధికారిత, భద్రత, ఉన్నత చదువుల కోసం తీసుకోవాల్సిన పలు చర్యల గురించి ఈ నివేదికలో కొన్ని సిఫార్సులు చేశారు.

నివేదికలోనూ ముఖ్యాంశాలు..
* తెలంగాణలో 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలు 30.8 శాతం కాగా, 21 ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయిలు 13.4 శాతంగా నమోదైంది.
* పెళ్లీడు కంటే ముందే దాదాపు 26 శాతం మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు జరుగుతుండగా.. దాదాపు 18 శాతం మంది అబ్బాయిలకూ అదే జరుగుతోంది.
* మేనరికం వివాహాలు జాతీయ స్థాయి (14 శాతం) కంటే ఇక్కడే అధికం (30 శాతం). ఇందులోనూ తండ్రి తరఫు చుట్టరికంతో పెళ్లిళ్లు 12.7 శాతం.
* గ్రామీణ భారతం (రూ.16,956)తో పోల్చితే గ్రామీణ తెలంగాణలో వైద్యసేవల ఖర్చు రూ. 21,683 అధికం.
* గ్రామీణ పురుషుల (రూ.15,393)తో పోల్చితే ఆరోగ్యానికయ్యే ఖర్చు గ్రామీణ మహిళలకు (రూ. 28,902) చాలా ఎక్కువ.
* ప్రసవానికయ్యే ఖర్చు కూడా ఇక్కడే ఎక్కువ ఉండడం గమనార్హం. దేశంలో గ్రామీణంలో ప్రసవానికి రూ. 5,544 ఖర్చవుతుండగా.. పట్టణ ప్రాంతాల్లో రూ. 11,685 ఖర్చవుతోంది. అదే తెలంగాణలో గ్రామీణంలో రూ. 13,320 ఖర్చవుతుండగా.. పట్టణ ప్రాంతాల్లో రూ. 18,969 ఖర్చవుతోంది.
* రక్తహీనతతో బాధపడుతున్నవారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉంటున్నారు.
* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు రాష్ట్రంలో సగటున 5.5 శాతం ఉండగా.. ఇందులో మహిళలు 6 శాతం.
* ఇన్‌ఫెక్షన్ల బారినపడుతున్నవారిలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు.
ఉన్నత విద్యకు దూరమే…
* ఉన్నత విద్య చదువుతున్న మహిళల శాతం తక్కువ. హైదరాబాద్‌, వరంగల్‌ మినహా మిగతా జిల్లాల్లో పరిస్థితి ఆశాజనకంగా లేదు.
* ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బాలిక విద్యపై వివక్ష కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ, ఆపై విద్యలో తక్కువ భాగస్వామ్యం ఉంది.

పరిస్థితుల మెరుగుకు సూచనలివి..
* ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీల్లో లింగ వివక్ష ఎక్కువగా ఉంది. బాలికలు చదువుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
* ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పొందుపరచాలి.
* బాలికలకు అందుబాటులో ఉండేలా చూడాలి. వీరికి ప్రత్యేకమైన ఉపకారవేతనాలు అందించాలి.
* బాలికలు పాఠశాలలకు సురక్షితంగా చేరుకునేందుకు రాయితీతో ప్రయాణ సదుపాయాలు కల్పించాలి.
* నల్గొండ, మెదక్‌ జిల్లాల్లో పాఠశాలల్లోచేరని ఎస్సీ, ఎస్టీలను చేర్పించేలాప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి.
* ఉన్నతవిద్యను అభ్యసించేందుకు వీలుగా బాలికల కోసం ప్రత్యేక విధానం రూపొందించాలి.