మెదడు – భాష – అభివృద్ధి

ఖచ్చితంగా సంస్కృతం గొప్ప భాష . అయితే సంస్కృతం తప్పనిసరిగా ఎక్కువ భాగం కంఠతా ద్వారానే రావాలి . అమరకోశం , శబ్దమంజరి , చివరికి వ్యాకరణ , ఛందస్సులు కూడా శ్లోకాల రూపంలోనే నేర్చుకోవాలి . మొదట శబ్దం , ఆపై అర్థంలోకి వెళ్ళాలి . బహుశా అదే దాని బలం – అదే దాని బలహీనత .

ఇంగ్లీషు రానంత వరకు సంప్రదాయరీతిలో సంస్కృతాన్ని నేర్చుకునే వారు . ఇదివరకు తెలుగు ఉపాధ్యాయులకు సంస్కృతం తప్పనిసరిగా వచ్చేది . కవులు , రచయితలు , పండితులు తెలుగులో ఎంత లబ్ధ ప్రతిష్ఠులయినా సంస్కృత పరిచయం అనంతంగా ఉండేది .

ఇప్పుడు తెలుగువారికే తెలుగు మీద అభిమానం ఇంగువకట్టిన గుడ్డగా కూడా మిగల్లేదు . ఇక సంస్కృతం అత్యాశ .

అయితే భాషగా ప్రతిదీ గొప్పే . మాతృ భాష మరీ గొప్పది . ప్రాణ సమానం .

మెదడు – భాష – అభివృద్ధి అన్న అంశంపై సైకాలజిస్టులు సశాస్త్రీయమయిన అధ్యయనాలు చేశారు . సృజనాత్మక వ్యక్తీకరణ , ఆవిష్కరణ , ఊహలకు మాటల రెక్కలు తొడగడం భాషతోనే సాధ్యం . భావాలు పాదుకోవడానికి , భావ ప్రసరణం జరగడానికి , తరాలకు వారధిగా నిలవడానికి భాషే మూలం .