మీ మొక్కుబడి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నా: పవన్ కల్యాణ్ ఘాటు లేఖ!

మీ మొక్కుబడి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నా: పవన్ కల్యాణ్ ఘాటు లేఖ!

నేడు ఏపీ సీఎం చంద్రబాబు తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి రాబోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఈ మేరకు చంద్రబాబుకు ఓ లేఖను రాసిన ఆయన, మొక్కు బడి సమావేశాలకు తాము దూరంగా ఉంటామని చెప్పారు. చంద్రబాబునాయుడు బుధవారం నాడు సమావేశం పెట్టి, మంగళవారం సాయంత్రం తమకు ఆహ్వానం పంపడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెబుతూనే, తగిన సమయం ఇవ్వకుండా, ఎజెండా ఏంటో చెప్పకుండా సమావేశాలు ఏంటని, ఇది రాజకీయ లబ్ది కోసమేనన్న సందేహాలున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సంఘటిత పోరుకు జనసేన సిద్ధమేనని, అయితే, ఇటువంటి సమావేశాలు ఎటువంటి ఫలితాలనూ ఇవ్వబోవని నమ్ముతున్నానని అన్నారు. బలమైన పోరాటం చేస్తేనే హోదా వస్తుందని, అటువంటి పోరాటం చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే చేతులు కలుపుతామని తన లేఖలో పవన్ వ్యాఖ్యానించారు.